
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) సొంత పార్టీ నేతలు తనపై గుప్పిస్తున్న విమర్శలకు స్పందించారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను గత యుద్ధాల గురించి ఏమాత్రం ప్రస్తావించలేదని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో.. తనను విమర్శించిన నేతలకూ తనదైన శైలిలో చురకలంటించారు.
‘‘గతంలో నియంత్రణ రేఖ(LOC) అవతల భారతీయ పరాక్రమం గురించి నాకు తెలియదని అనుకునే ఉత్సాహవంతుల(zealots) కోసమే ఇది. నేను ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాత్రమే మాట్లాడాను. గత యుద్ధాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు’’ ఎక్స్‌లో శశి థరూర్ పోస్ట్ చేశారు. అయితే ఎప్పటిలాగే తన అభిప్రాయాలపై విమర్శలు, ట్రోల్స్ చేసేవాళ్లకు స్వాగతం చెబుతూ.. చేయడానికి తనకెన్నో మంచి పనులు ఉన్నాయంటూ పోస్టులో పేర్కొన్నారు.
After a long and successful day in Panama, i have to wind up at midnightvhere with departure for Bogota, Colombia in six hours, so I don’t really have time for this — but anyway: For those zealots fulminating about my supposed ignorance of Indian valour across the LoC: in tge…
— Shashi Tharoor (@ShashiTharoor) May 29, 2025
థరూర్ ఏమన్నారంటే..
ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు.
అయితే 2016లో ప్రధాని మోదీ సారథ్యంలో తొలిసారి భారత సైన్యం పాక్‌లోకి చొచ్చుకుపోయిందని శశి థరూర్ చెప్పారని విమర్శించిన కాంగ్రెస్ నేత ఉదిత్‌రాజ్.. థరూర్‌ను బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించాలి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు థరూర్‌కు బీజేపీ నేతలు మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా థరూర్‌కు మద్దతు తెలుపుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: థరూర్ లక్ష్మణ రేఖ దాటారా?