నష్టాల్లో మెట్రో రైలు!


సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో రైల్వేకు మొదటి మూడు నెలల్లో రూ.57 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆడిట్‌లో వెల్లడైంది. ప్రస్తుతం వడాల-చెంబూర్ మధ్య నడుస్తున్న మోనో రైలు కూడా నష్టాల బాటలో నడుస్తోంది. దీని జాబితాలో మెట్రో కూడా చేరిపోయింది. ఘాట్కోపర్-అంధేరి- వర్సోవా మెట్రో సేవలు జూన్ ఎనిమిదో తేదీ నుంచి ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చాయి. అందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) రూ.4,500 కోట్లు ఖర్చు చేసింది. కాని అత్యంత ఖరీదైన సేవలు అతి తక్కువ చార్జీలతో అందించడం గిట్టుబాటు కావడం లేదు.



అదేవిధంగా మెట్రో రైళ్లకు, ప్రయాణికులకు కల్పిస్తున్న భద్రత, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమరాలు, పెద్ద సంఖ్యలో నియమించిన సిబ్బంది, మెట్రో రైళ్ల నిర్వహణ, బ్యాగ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇస్తున్న రాయితీ తదితర కారణాలవల్ల మెట్రోకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో స్పష్టమైంది. ప్రారంభంలో కేవలం రూ.10 ల చార్జీతో ఎక్కడికైనా ప్రయాణించేందుకు అనుమతి కల్పించింది. దీంతో ముంబైకర్లు పూర్తి ఆనందాన్ని ఆస్వాదించారు. మొదటి రెండు, మూడు నెలలు ప్రతీరోజు 2.40 లక్షల మంది ప్రయాణించారు. ఆ తర్వాత ఈ సంఖ్య మూడు లక్షలకు చేరింది. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో రెట్టింపు అయింది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ కార్డులు, సీజన్ పాస్‌లు జారీచేయడం ప్రారంభించారు.



ఆ తర్వాత ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో వైఫై సేవలు కూడా ప్రారంభించింది. కాని టికెటు చార్జీలు మాత్రం సేవలకు తగ్గట్టుగా పెంచలేదు. కనీస చార్జీ రూ.10 ఉండగా ఆ తర్వాత దూరాన్ని బట్టి రూ.20, రూ.30 నిర్ణయించింది. కాని అనేక మంది ఉద్యోగులు స్మార్ట్ కార్డు, సీజన్ పాస్‌లు వినియోగిస్తున్నారు. దీంతో ఆదాయం మరింత పెరిగింది. కాని ప్రారంభంలో ఈ సౌకర్యాలు అందుబాటులో లేకున్నప్పటికీ సరదా కోసం ప్రయాణంచే వారి సంఖ్య ఎక్కువ ఉండేది. దీంతో వివిధ నిర్వహణ భారాలు, సిబ్బంది ఖర్చుల భారం ఎమ్మెమ్మార్డీయేపై విపరీతంగా పడింది. ప్రారంభంలో మోనోతో పోలిస్తే మెట్రో లాభాల బాటలో నడుస్తోందని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. కాని ఇదికూడా నష్టాల బాటలో నడుస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో స్పష్టమైంది. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top