అన్నాడీఎంకే జాబితా | Jayalalithaa announces candidates for all 40 constituencies | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే జాబితా

Feb 24 2014 11:47 PM | Updated on Mar 9 2019 3:34 PM

అన్నాడీఎంకే జాబితా - Sakshi

అన్నాడీఎంకే జాబితా

లోక్‌సభ ఎన్నికలకు అందరికంటే ముందుగా అన్నాడీఎంకే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాలకు అభ్యర్థులను సీఎం జయలలిత ప్రకటిం చారు.

 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జయ
  మూడు నుంచి ప్రచార బాట
 
 సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికలకు అందరికంటే ముందుగా అన్నాడీఎంకే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాలకు అభ్యర్థులను సీఎం జయలలిత ప్రకటిం చారు. సీపీఎం, సీపీఐలతో  సీట్ల పందేరం
 కొలిక్కి వచ్చాక జాబితాలోని కొన్ని పేర్లను తొలగిస్తామన్న ప్రకటనతో అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఎవరి సీటు పదిలంగా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో గెలుపు లక్ష్యంగా ప్రచారానికి అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత సిద్ధం అయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నారుు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, సీపీఎం, సీపీఐల నేతృత్వంలోని కూటమి పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాల కైవశం లక్ష్యంగా వ్యూహ రచనలో ఉంది. తమ అధినేత్రి జయలలితను ప్రధాని సింహాసనంలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా అన్నాడీఎంకే వర్గాలు ఉరకలు తీస్తున్నారుు. ఈ పరిస్థితుల్లో అందరి కన్నా ముందుగా తమ అభ్యర్థుల జాబితాను అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత సోమవారం ప్రకటించారు.
 
 గెలుపు లక్ష్యం: రాష్ట్ర సంక్షేమం, దేశ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అన్ని స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా తమ పార్టీ ఎన్నికలకు వెళుతుందని జయలలిత ప్రకటించారు. ఉదయం రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని వివరించారు. సీపీఎం, సీపీఐలు తమ మిత్ర పక్షాలని, వారితో సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ చర్చలు కొలిక్కి వచ్చాక, తమ అభ్యర్థుల్లో కొందరిని వెనక్కు తీసుకోవడం జరుగుతుందన్నారు.
 
 ప్రచారం:  రాష్ట్రంలో మార్చి మూడో తేదీ నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మూడో తేదీ కాంచీపురం తేరడిలో ఆరంభించే ప్రచార సభ ఏప్రిల్ ఐదో తేదీ శంకరన్ కోవిల్‌లో ముగించనున్నట్టు వివరించారు. తమ పార్టీ, మిత్ర పక్షాల అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పర్యటన సాగనుందన్నారు. ప్రస్తుతానికి  తమిళనాడులోని అన్ని సీట్ల గెలుపే తన లక్ష్యమని, జూన్‌లో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన ప్రచార పర్యటన జాబితాను ఓ తమిళ మీడియా ప్రతినిధికి ప్రత్యేకంగా జయలలిత అందించారు.
 
 అభ్యర్థుల్లో గుబులు: అన్నాడీఎంకే అభ్యర్థులందరూ పట్టభద్రులే. ఎంబీబీఎస్, ఎండీ, బీఎల్, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీలు చేసిన వారికే అత్యధిక శాతం సీట్లు కేటాయించారు. ముగ్గురు మహిళలకు, ఒక మైనారిటీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కింది. వారు తిరువళ్లూరు, తిరుచ్చి, కరూర్ రేసులో ఉన్నారు. అత్యధిక శాతం సీట్లు కొత్త వాళ్లకు కేటాయించడం విశేషం. వీరిలో యువత అధికం. కొందరు అన్నాడీఎంకే సీనియర్ల వారసులు ఉన్నారు. అదే సమయంలో తమను ఎంపిక చేసినా, ఎవరి సీటు ఎప్పుడు ఊడుతుందోనన్న బెంగ అభ్యర్థుల్లో ఇప్పటికీ నెలకొంది. సీపీఎం, సీపీఐలకు తలా రెండు చొప్పున నాలుగు సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, ఆ సంఖ్యను పెంచి ఇవ్వాలన్న పట్టుతో సీపీఎం, సీపీఐలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, వారు కోరబోయే స్థానాలు  ఏవో, ఎవరి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం వెనక్కు తీసుకుంటుందోనన్న బెంగ అభ్యర్థుల్లో నెలకొంది. గత అనుభవాల దృష్ట్యా, ఈ చిట్టాల్లో ఎన్ని మార్పులు, మరెన్ని సవరణలు జరగబోతున్నాయో వేచి చూడాల్సిందే. ఇక ఢిల్లీలో తమ అధినేత్రి పీఎం అయితే తమకు మంత్రి పదవులు దక్కుతాయన్న ఆశతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేందుకు యత్నించిన పలువురు సీనియర్‌లకు నిరాశే మిగిలింది.
 
 వీరే అభ్యర్థులు :
 తిరువళ్లూరు(రి)- డాక్టర్ వేణుగోపాల్,  ఉత్తర చెన్నై - టీజీ వెంకటేష్ బాబు, దక్షిణ చెన్నై - డాక్టర్ జే జయ వర్దన్, సెంట్రల్ చెన్నై  - ఎస్‌ఆర్ విజయకుమార్, శ్రీ పెరంబదూరు - కేఎన్‌రామచంద్రన్, కాంచీపురం(రి) - మరగదం కుమర వేల్, అరక్కోణం -  తిరుత్తణి  కే హరి, వేలూరు - సెంగుట్టవన్,  కృష్ణగిరి - కే అశోక్‌కుమార్, ధర్మపురి - పి ఎస్ మోహన్, తిరువణ్ణామలై - ఆర్ వన రోజా, ఆరణి - సెంజి సేవల్ ఏ వేలు, విల్లుపురం (రి) - రాజేంద్రన్,  కళ్లకురిచ్చి - డాక్టర్ కె  కామరాజ్, సేలం - వి పన్నీరు సెల్వం,  నామక్కల్ - పీఆర్ సుందరం, ఈరోడ్డు  - ఎస్ సెల్వకుమార చిన్నయ్యన్, తిరుప్పూర్- వి సత్య భామా,  నీలగిరి  - డాక్టర్  సీ గోపాల కృష్ణన్,  కోయంబత్తూరు - ఏపీ నాగరాజన్,  పొల్లాచ్చి - సీ మహేంద్రన్, దిండుగల్ - ఎం ఉదయకుమార్,  కరూర్ - తంబిదురై,  తిరుచ్చి - కుమార్, పెరంబలూరు - ఆర్‌పీ మరుదై రాజ్ అలియాస్ మరుదరాజా, కడలూరు - అరుణ్ మోళి దేవన్,  చిదంబరం (రి)  - చంద్రకాశి, మైలాడుతురై - ఆర్‌కే భారతీ మోహన్, నాగపట్నం (రి) - డాక్టర్ కే గోపాల్, తంజావూరు - కే పరశురామన్,  శివగంగై - పీఆర్ సెంథిల్ నాధన్,  మదురై - ఆర్ గోపాల కృష్ణన్,  తేని - ఆర్ పార్తీబన్,  విరుదునగర్ - డి.రాధాకృష్ణన్, రామనాధపురం - అన్వర్ రాజా, తూత్తుకుడి - జే జయసింగ్ త్యాగరాజ్ నటరాజ్, తెన్‌కాశి- వసంతి మురుగేషన్, తిరునల్వేలి - కే ఆర్‌పి ప్రభాకరన్, కన్యాకుమారి - డి జాన్ తంగం, పుదుచ్చేరి - పుదుచ్చేరి ఎంబి ఓమలింగం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement