పుణే నగరంలోని దత్తాత్రేయ మందిరాల్లో దత్త జయంతి సోమవారం ఘనంగా జరిగింది. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు బారులు తీరారు.
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగరంలోని దత్తాత్రేయ మందిరాల్లో దత్త జయంతి సోమవారం ఘనంగా జరిగింది. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు బారులు తీరారు. వివిధ ఆలయాలలో అఖండ గురుచరిత్ర పారాయణం, హారతి, జన్మోత్సవాలను జరిపారు. పుణేలోని మండాయి దత్తమందిర్, కసబాపేట్‌లోని కాళదత్తమందిర్, నారాయణ్‌పూర్‌లోని దత్త మందిర్, నవీపేట్‌లోని లోకమాన్య నగర్ దత్తమందిర్‌లతోపాటు వివిధ మండళ్లు దత్త జయంతి సందర్భంగా తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేశాయి. భక్తులు ఔదాంబిర వృక్షాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అప్పా బల్వంత్ చౌక్‌లోని ఆనందాశ్రమములో భజనలు, ప్రవచనాలు, కీర్తనలు ఆలపించారు. అదేవిధంగా నాటకాలు ప్రదర్శించారు. వాసుదేవానంద సరస్వతి టేంబేస్వామి సమాధి 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురుచరిత్ర పారాయణం చేశారు. వార్జేలోని చిదానంద ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో భగవతితాయి సతార్కర్ కీర్తనలు ఆలపించారు.
అలీబాగ్ నుంచి వచ్చిన పల్లకీ యాత్రకు శ్రీ క్షేత్రనారాయణ్‌పూర్‌లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దీపక్ పాయేగుడే, నిలేష్ కణసే, ఉమేష్ శేడగే, జితేంద్ర బోత్రే తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయుడిని దర్శించ్జుకునేందుకు భక్తులు బారులు తీరారు. సుతార్‌వాడి మహాదేవ్ మందిరంలో దత్త జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయాలలో తీర్థ ప్రసాదాలు పంచారు.