తాగునీటికి ఇక్కట్లే


శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నీటిమట్టం 854 అడుగులు కొనసాగించాలని రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా  తెలంగాణా ప్రభుత్వం భూగర్భజలవిద్యుత్‌కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. రాయలసీమ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో మన ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదనను నిలిపివేసింది. రోజుకు సుమారు 40వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ తెలంగాణప్రాంతంలో ఉన్న జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పాదన చేస్తున్నారు.రైతుల ఆందోళనలు మొదలైన నాటి నుండి నిరంతరం కాకుండా అప్పుడప్పుడు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గురువారం 6,237 క్యూసెక్కులను వినియోగించుకుని భూగర్భజలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేశారు. కృష్ణాబోర్డు జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని, విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గేజింగ్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం కూడా ఒక జనరేటర్‌తో విద్యుత్ ఉత్పాదన మొదలు పెట్టినట్లు తెలిసింది.అయితే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తీరు, వినియోగించుకుంటున్న నీటి పరిమాణం వివరాల వాస్తవిక లెక్కలు చెప్పడం లేదని గేజింగ్ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం శ్రీశైలానికి లేదు. శుక్రవారం సాయంత్రానికి జలాశయ నీటిమట్టం 857 అడుగులకు చేరుకుంది. మరో మూడు అడుగుల నీటిమట్టం తగ్గితే 854 అడుగులకు చేరుకుంటుంది.ఆ తరువాత ఏ కొంచెం నీటిమట్టం తగ్గినా, నీటిఆవిరి శాతం పెరిగినా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని అందించే వీలుండదు.  దీంతో పంటలు దెబ్బ తినే అవకాశం ఉంది. రానున్న వేసవికాలంలో కూడా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. శ్రీశైలం నుండి కృష్ణా జలాలు తరలిపోతున్నా ప్రజాప్రతినిధులు నోరు మొదపకపోవడంపై  రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కృష్ణా జలాల తరలింపుపై తక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో రాయలసీమ గొంతెండిపోనుంది.

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top