మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల నియామక సిఫారసుల జాబితాను సుప్రీం కోర్టు వెనక్కు పంపింది. కొత్త జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిం ది.
సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల నియామక సిఫారసుల జాబితాను సుప్రీం కోర్టు వెనక్కు పంపింది. కొత్త జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిం ది. దీంతో న్యాయవాదుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అత్యుత్తమ తీర్పులకు వేదికగా నిలిచిన మద్రాసు హైకోర్టు పరిధిలో మదురై ధర్మాసనం, పుదుచ్చేరి ప్రత్యేక కోర్టుతో పాటుగా 29 సహాయ కోర్టులు ఉన్నాయి. ఈ హైకోర్టులో 60మంది జడ్జిలు ఉండాలి. ఇందులో చాలా పోస్టులు ఖాళీ ఉండడంతో దశల వారీగా భర్తీ చేసేందుకు రాష్ట్రపతి కార్యాలయం, సుప్రీం కోర్టు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం 13 మంది న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ భర్తీకి సంబంధించి నివేదికను ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్ నేతృత్వం లోని కమిటీ సిద్ధం చేసింది. సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌ను ఈ కమిటీ ముందు ఆయా సంఘాలు ఉంచా యి.
అయితే, తమ డిమాండ్లకు భిన్నంగా సిఫారసుల నివేదిక ఢిల్లీకి వెళ్లిన సమాచారం 13 పోస్టుల్లో పన్నెండు పోస్టుల భర్తీ నిమిత్తం వెళ్లిన సిఫారసుల నివేదికలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. ఈ సిఫారసుల నివేదికను వెనక్కు పంపించాలని, దాన్ని అమలు చేయకూడదని నినాదించారు. అదే సమయంలో సీనియర్ న్యాయవాది ఆర్ గాంధీ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సిఫారసుల నివేదిక అమలుకు స్టే మంజూరు అయింది. దీన్ని తొలగించాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్ కలైయరసన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీన్ని గుర్తించిన న్యాయవాద సంఘం నాయకులు పాల్ కనకరాజ్, ప్రభాకరన్, ప్రసన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సధాశివంను రెండు రోజుల క్రితం కలుసుకుని ఆ సిఫారసుల జాబితాలో పేర్కొన్న అనర్హుల గురించి ఫిర్యాదు చేశారు.
తిరస్కరణ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకంతో న్యాయవాద సంఘం నాయకులు చెన్నైకు వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్ సుప్రీం కోర్టుకు పదోన్నతిపై వెళ్లారు. దీంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా అగ్నిహోత్రి నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి పదోన్నతితో ఆయన సిద్ధం చేసిన జాబితా తిరస్కరణకు గురవుతుందని న్యాయవాదులు ఊహించారు. వారు ఊహించినట్టుగానే ఆ జాబితాను సుప్రీం కోర్టు వెనక్కు పంపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం, న్యాయమూర్తి ఆర్ ఎం లోథాలతో కూడిన బెంచ్ ఆ జాబితాను పరిశీలించింది. కొత్త జాబితాను సిద్ధం చేసే విధంగా పాత జాబితాను కేంద్ర న్యాయ శాఖకు శనివారం పంపించేశారు. పాత జాబితా రద్దు కావడంతో మద్రాసు హైకోర్టుకు పూర్తి స్థాయిలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోయే వారి ద్వారా కొత్త జాబితా సిద్ధం చేయనున్నారు. దీంతో ఈ జాబితాలోనైనా అర్హులైన వారిని ఎంపిక చేయించడం, తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం లక్ష్యంగా న్యాయవాదులు సమాయత్తం అవుతున్నారు. పాత జాబితా రద్దుతో న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.