
సాక్షి, ఢిల్లీ: ‘‘మీ నేతలను కీర్తించేందుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారు’’ అంటూ.. తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని(DMK Government) సుప్రీం కోర్టు నిలదీసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం(Karunanidhi Statue) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ నిధులను కరుణానిధి విగ్రహం కోసం ఉపయోగించడంపై సుప్రీం కోర్టు(Supreme Court Karunanidhi Statue) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లతోకూడిన ధర్మాసం తమిళనాడు ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది.
‘‘అసలు విగ్రహ ఏర్పాటునకు ప్రభుత్వ నిధులను ఎందుకు ఉపయోగించాలి?. మీ మాజీ నేతలను కీర్తించడానికి ప్రభుత్వ నిధులను ఎందుకు ఖర్చు చేయాలి?’’ అని ప్రశ్నలు గుప్పించింది. ఈ క్రమంలో.. గతంలో మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఇచ్చిన ఉత్తర్వును సమర్థిస్తూ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసింది. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యర్థనను ఉపసంహరించుకుని మళ్లీ హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది
తిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రధాన రహదారిలో ఉన్న పబ్లిక్ ఆర్చ్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత నేత కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. అయితే.. అది ప్రభుత్వ స్థలం. పైగా గతంలో హైకోర్టు ఈ తరహా నిర్మాణాలపై కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి కోర్టుల పర్మిషన్ అవసరం పడింది. అందుకే.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
అయితే.. పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాలు, నేమ్ బోర్డులు వంటి నిర్మాణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం, పైగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని అభిప్రాయపడుతూ మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే అక్కడా డీఎంకే ప్రభుత్వానికి చుక్కెదురైంది.
‘‘ప్రభుత్వ నిధులు ప్రజల అవసరాలకు ఉపయోగించాలి.. వ్యక్తిగత కీర్తి కోసం కాదు. పబ్లిక్ ప్లేస్‌లో విగ్రహాలు ట్రాఫిక్, భద్రత, ప్రజా అసౌకర్యానికి దారితీయవచ్చు. ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’’ అని ఇటు హైకోర్టు, ఆ తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: పరువు నష్టం కేసులు.. ఇక ఆ టైం వచ్చింది!