మంత్రుల్లో గుబులు | Sakshi
Sakshi News home page

మంత్రుల్లో గుబులు

Published Wed, Oct 14 2015 2:34 AM

మంత్రుల్లో గుబులు - Sakshi

  ముగ్గురిపై వేటుకు రంగం సిద్ధం
  మంత్రులతో సీఎం జయలలిత సమాలోచన
  కొడునాడు పయనానికి కసరత్తు

  సాక్షి, చెన్నై : రాష్ట్ర మంత్రి వర్గంలో మళ్లీ మార్పులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నా యి. ముగ్గురిపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రుల్లో గుబులు పట్టుకుంది. సీఎం జయలలిత కొడనాడుకు పయనమయ్యేందుకు రెడీ అవుతున్నారు. పోయేస్‌గార్డెన్‌లో మంగళవారం ముఖ్యమైన మం త్రులు, అధికారులతో సమాలోచిం చారు.  రాష్ట్ర మంత్రి వర్గంలో తరచూ మార్పులు జరగడం పరిపాటే. ఏ మంత్రి పదవి  ఏ రోజు ఉంటుం దో ఊడుతుందో వారికే తెలియదు. అన్నాడీఎంకేలో హేమాహేమీలుగా, అధినేత్రి జయలలితకు సన్నిహితంగా ఉన్న వాళ్లు సైతం పదవులు కోల్పోక తప్పలేదు.
 
 ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం మీద సీఎం జయలలిత దృష్టిపెట్టి ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇం దులో భాగంగా గత వారం పార్టీ జిల్లాల కార్యదర్శుల నియామక ప్రక్రియను ముగిం చారు. వీరందర్నీ చెన్నైకు పిలిపించి ప్రత్యేకంగా  ఉపదేశాలు ఇచ్చి పంపించారు. ఈ నియామకాల్లో  కొందరు మంత్రులకు జయలలితకు షాక్‌ఇచ్చారని చెప్పవచ్చు. వారి చేతుల్లో ఇది వరకు ఉన్న పార్టీ పదవుల్ని లాగేసుకుని కేవలం మంత్రి పదవులకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో మంత్రి మోహన్ కూడా ఒకరు. ఈయనపై ఆరోపణలు రావడంతోనే పార్టీ పదవికి దూరంగా పెట్టినట్టు సమాచారం.
 
 గుబులు
 మరి కొందరు మంత్రులుగా ఉన్న జిల్లాల్లో పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్న వాళ్లకు జిల్లాల కార్యదర్శుల పదవులు కట్టబెట్టారు. ఈ దృష్ట్యా, ఆ మంత్రుల్లో ఆందోళన బయలు దేరింది. ఎక్కడ తమ పదవులు ఊడుతాయోనన్న బెంగ బయలు దేరింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి వర్గంలో మార్పు ఉండదన్న ధీమా కొందరిలో ఉన్నా, తాజాగా ఉద్వాసన పలికిన పక్షంలో, మళ్లీ సీటు దక్కుతుందో లేదోనన్న గుబులు ఆ మంత్రులను వేధిస్తోంది. అదే సమయంలో కొందరు మంత్రుల సేవల్ని పూర్తి స్థాయిలో పార్టీకి ఉపయోగించుకునేందుకు జయలలిత నిర్ణయించి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వారిని మంత్రి పదవుల నుంచి తొలగించి, వారి స్థానంలో తాత్కాళికంగా కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ప్రధానంగా ముగ్గురు మంత్రుల మీద మాత్రం వేటు వేయడానికి జయలలిత నిర్ణయించి ఉన్నట్టు, ఇందుకు తగ్గ రంగం సిద్ధమవతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. జయలలిత కొడనాడు పయనం అవుతున్నట్టు, అక్కడికి వెళ్లగానే ఈ మార్పులు ఉండొచ్చనన్న సంకేతాలు విన్పిస్తున్నాయి.
 
 కొడనాడు పయనం
 సీఎం జయలలిత కొడనాడు పయనానికి కసరత్తులు జరుగుతోంది. బుధవారం ఆమె పయనమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్న జయలలిత అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే సిరుదావూర్‌కు వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆదివారం చెన్నైకు వచ్చారు. సోమవారం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆమె, కొడనాడు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. నెల రోజులు పాటు నీలగిరి జిల్లా కొడనాడులోనే ఆమె ఉంటారని సమాచారం. ఇక ప్రభుత్వ వ్యవహారాలు అక్కడి నుంచే సాగబోతున్నట్టు, అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు చేస్తున్నట్టు తెలిసింది. కొడనాడు పయనానికి సిద్ధమవుతున్న సమాచారం ఓ వైపు ఉంటే, మరో వైపు  మంగళవారం ముఖ్య అధికారులు, ముఖ్యమైన మంత్రుల్ని పోయేస్ గార్డెన్‌కు జయలలిత పిలిపించి సమావేశం ఏర్పాటు చేశారు. తాను కొడనాడు వెళ్తున్న దృష్ట్యా, ప్రభుత్వ వ్యవహారాల మీద దృష్టి పెట్టడం, మంత్రి వర్గంలో చేపట్టనున్న మార్పు గురించి ఆ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.
 

Advertisement
Advertisement