మహానగర పాలక సంస్థ (బీఎంసీ) 2015-2016 ఆర్థిక బడ్జెట్ ను బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే స్థాయి సమితి అధ్యక్షుడు యశోధర్ ఫణసేకు సమర్పించారు.
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) 2015-2016 ఆర్థిక బడ్జెట్ ను బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే స్థాయి సమితి అధ్యక్షుడు యశోధర్ ఫణసేకు సమర్పించారు. మొత్తం రూ. 33,514 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో రూ. 500 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు స్థాయి సమితి మంజూరునిచ్చింది. స్థాయి సమితి సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, వివిధ రాజకీయ పార్టీలకు రూ. 2.50 కోట్ల నుంచి రూ. ఏడు కోట్ల వరకు నిధులు కేటాయించింది.
అధికారంలో ఉన్న శివసేన దాదాపు రూ.140 కోట్ల నిధులు తమ వాటాలో వేసుకుంది. వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకోసం 227 మంది కార్పొరేటర్లకు రూ. 1.60 కోట్లు చొప్పున, మేయర్‌కు రూ. 100 కోట్లు, రేస్‌కోర్స్‌లో థీమ్ పార్క్ నిర్మాణం కోసం రూ.ఐదు కోట్లు మంజూరయ్యాయి. డబ్బావాలా భవనానికి రూ. రెండు కోట్లు, కస్తూర్బా ఆస్పత్రిలో అంటు వ్యాధుల పరీక్షల ఆధునిక ల్యాబ్‌కు, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో ఒక్కో ల్యాబ్ ఏర్పాటుకు, కళ, సాంృ్కతిక భవనం కోసం రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. అలాగే మాథాడి కార్మికుల భవనానికి రూ. రెండు కోట్లు, ఆరే కాలనీలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికిగానూ కృత్రిమ చెరువు ఆధునీకీకరణ, ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో ఉన్న చౌక్‌ల అలంకరణ పనులకు రూ. ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేశారు.