మానసిక అస్వస్థతతో బాధపడుతున్న బీబీఎంపీ కార్పొరేటర్ లలిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు.
బెంగళూరు: మానసిక అస్వస్థతతో బాధపడుతున్న బీబీఎంపీ కార్పొరేటర్ లలిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఆమె ఇక్కడి సాగర్ అపోలో ఆస్పత్రిలో కోమాలో ఉన్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక్కడి గిరినగర వార్డు నుంచి లలిత మొదటి సారి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆమె చాలా కాలం నుంచి క్లీఫ్లోమేనియా వ్యాధితో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచి వైద్యం చేయించుకుంటున్న వ్యాధి నయం కాలేదు. మంగళవారం బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, శాసన సభ్యుడు రవిసుబ్రమణ్య, పాలికె అధికార పార్టీ పరిపాల విభాగం నాయకుడు ఎన్.ఆర్. రమేష్ తదితరులు సాగర్ అపోలో ఆసుపత్రి చేరుకుని లలిత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
చోరీ కేసులో అరెస్ట్
కార్పొరేటర్‌గా గెలుపొందిన లలిత ఒక చోరీ కేసులో ఇక్కడి ఉప్పరపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీనగరలోని సుఖసాగర్ కాంప్లెక్స్‌లోని అశోక్ అపెరెల్స్‌లో చాలా కాలం నుంచి లలిత బట్టల కొనుగోలు చేసేవారు. ఇదే సంవత్సరం ఏప్రిల్‌లో అశోక అపెరెల్స్‌కు వెళ్లిన లలిత, ఐదు టాప్‌లు తీసుకుని డ్రస్సింగ్ రూంలోకి వెళ్లారు. తరువాత మూడు టాప్‌లు ఒక దాని మీద ఒకటి వేసుకున్నారు. మూడు టాప్‌ల మీద ఆమె డ్రస్ వేసుకున్నారు.
రెండు టాప్‌లు తీసుకు వచ్చి అక్కడ పని చేస్తున్న సేల్స్ మెన్‌కు ఇచ్చి నాకు బట్టలు నచ్చలేదని చెప్పి బయటకు రావడానికి ప్రయత్నించారు. సేల్స్‌మెన్‌కు అనుమానం వచ్చి యజమానికి చెప్పారు. బట్టల షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ పోలీసులు వచ్చి పరిశీలించగా లలిత లోపల మూడు టాప్‌లు వేసుకున్న విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన లలిత ఇంటిలోనే ఉంటున్నారు. క్లీఫ్లోమేనియా వ్యాధి వల్లే ఆమె చోరీ చేసిందని అప్పట్లో వైదులు తెలిపారు. తాను జైలుకు వెళ్లాలనని లలిత పదేపదే బాధపడేవారని సమాచారం.
ఆత్మహత్యాయత్నం........?
లలిత ఇంటిలో విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఆమె ఇంటిలో విషం సేవించారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అనారోగ్యం కారణంగానే లలితను ఆసుపత్రిలో చేర్పించామని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్యహత్యాయత్నం కేసు నమోదు కాలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.