పోగొట్టుకున్న రూ.50 వేలను సొంతదారునికి అప్పగించి ఓ ఆటోడ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నారు. చెన్నై ఎంసీ రోడ్డులో నగల దుకాణం ఉంది.
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : పోగొట్టుకున్న రూ.50 వేలను సొంతదారునికి అప్పగించి ఓ ఆటోడ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నారు. చెన్నై ఎంసీ రోడ్డులో నగల దుకాణం ఉంది. ఈ దుకాణం ముందు నూతన సంవత్సరం రోజున ఒక సంచి పడి ఉంది. ఆ మార్గంగా వచ్చిన అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ రమేష్ సంచిని తీసి నగల దుకాణం మేనేజర్‌కు అప్పగించాడు. అతను దానిని విప్పి చూడగా అందులో రూ.50 వేల నగదు ఉంది. వెంటనే దీని గురించి చాకలిపేట పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఏళుకినరు ప్రాంతానికి చెందిన కాజామొయిద్దీన్ (40) గురువారం నగల దుకాణం ముందు ఏదో వెతుకుతున్నట్టు కనబడ్డాడు.
ఇది చూసిన స్థానికులు కాజామొయిద్దీన్ కలిసి నగల దుకాణం మేనేజర్ వద్ద విచారణ చేశారు. మేనేజర్ అక్కడికి వచ్చి కాజామొయిద్దీన్‌ను విచారణ చేయగా సిమెంటు ఏజెంటుగా పని చేస్తున్నాడని కలెక్షన్ చేసిన రూ.50 వేలు తీసుకుని వెళుతుండగా కింద పడి పోయినట్టు తెలిపారు. దీంతో నగల దుకాణం ముందు ఏర్పాటుచేసిన సీసీ కెమెరా తనిఖీ చేయగా నగదు పోగొట్టుకున్న వ్యక్తి కాజా మొయిద్దీన్ అని తెలిసింది. అతనికి రూ.50 వేలను అప్పగించారు. ఆటో డ్రైవర్‌ను అందరూ అభినందించారు.