అన్నాడీఎంకే అన్ని పార్టీల కంటే ముందు ఉండాలని ఉత్సాహపడటం మంచిదే, అది అత్యుత్సాహమైతేనే ప్రమాదం. కాంచీపురంలో అదే జరిగింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అన్ని పార్టీల కంటే ముందు ఉండాలని ఉత్సాహపడటం మంచిదే, అది అత్యుత్సాహమైతేనే ప్రమాదం. కాంచీపురంలో అదే జరిగింది. ఈ సంఘటన ఒకరిపై కేసు, మరొకరిని కట కటాలపాలుచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంచీపురం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా మరగతం కుమారవేల్ పోటీచేశారు. ప్రస్తుతం ఈ స్థానం కాంగ్రెస్ చేతుల్లో ఉంది. అక్కడి సిట్టింగ్‌ఎంపీ విశ్వనాథన్‌కే పార్టీ మళ్లీ టికెట్ ఇచ్చింది. డీఎంకే నుంచి జే సెల్వం, బీజేపీ కూటమి అభ్యర్థి(ఎండీఎంకే) మల్లై సత్య తలపడ్డారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలో గెలుపు అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. కాంగ్రెస్ నుంచి కంచి స్థానాన్ని లాక్కోవాలని ఎవరికివారు పోటాపోటీగా ప్రచారం చేశారు.
వచ్చేనెల 16వ తేదీ లెక్కింపు పూర్తయ్యే వరకు ఓపిక పట్టలేని అన్నాడీఎంకే నేతలు విజయాన్ని చాటుకున్నారు. కంచి అన్నాడీఎంకే 1,60,094 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఏకంగా ఫ్లెక్సీనే పెట్టేశారు. పనిలో పనిగా ఓటర్లకు కృతజ్ఞతలు కూడా చెప్పేశారు. అన్నాడీఎంకే కౌన్సిలర్ పరిమళం పేరున ముఖ్యమంత్రి జయలలిత పలువురు పార్టీ నేతలతో కూడిన ఆ ఫ్లెక్సీ పట్టణంలో కలకలం సృష్టించింది. అన్నాడీఎంకే వైఖరితో అగ్గిమీద గుగ్గిలమైన కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథన్ ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్‌కు ఫిర్యాదు చేశారు.
ఇతర పార్టీల నేతల ఫిర్యాదు మేరకు తహశీల్దారు భాను స్వయంగా వచ్చి ఫ్లెక్సీని తొలగించగా, కౌన్సిలర్ పరిమళంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లెక్సీ తయారుచేసిన డిజిటల్ సంస్థ యజమాని గోపీనాధ్ (35)ను అరెస్ట్ చేసి, సంస్థకు సీల్ వేశారు. ఈ విషయంపై తమకు నేరుగా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ మంగళవారం మీడియాతో అన్నారు. లెక్కింపునకు ముందే ఇటువంటి ఫ్లెక్సీని పెట్టడం ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు. అయినా జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక నివ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.


