ప్రపంచ కప్‌ జట్టు  దాదాపు ఖరారైనట్లే!

World Cup squad more or less settled says Rohit - Sakshi

ప్రస్తుత బృందంలోనుంచే ఎంపిక

ఎవరైనా గాయపడితేనే మార్పులు

ధోని మా దిక్సూచి

వన్డే వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ

సిడ్నీ: ఒకటీ, రెండు మార్పుచేర్పులు తప్ప... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో తలపడనున్న ప్రస్తుత జట్టే వన్డే ప్రపంచకప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. అంత మాత్రాన ఎవరికీ చోటు ఖాయం కాదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు గురువారం ఇక్కడ అతడు మీడియాతో మాట్లాడాడు. ‘తుది జట్టు గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటే. ఇంకా 4, 5 నెలల సమయం ఉంది. అయితే, రానున్న సిరీస్‌లలో భాగంగా జరిగే 13 వన్డేల్లో ఆడే జట్టే ప్రపంచ కప్‌నకు వెళ్తుంది. ఫామ్‌ లేమి, గాయాల కారణంగా మార్పులుండొచ్చు. ఇది కచ్చితమేం కాదు. కానీ భారీ మార్పులైతే ఉండవని భావిస్తున్నా.

ఏడాదిగా తీరిక లేని క్రికెట్‌ ఆడాం. కాబట్టి గాయాలు, ఫామ్, ఫిట్‌నెస్‌ సమస్యలకు ఆస్కారం ఉంది’ అని రోహిత్‌ అన్నాడు. ఆటతీరులో చిన్నచిన్న లోపాలను అధిగమిస్తామని అతడు చెప్పాడు. ‘ఇది వ్యక్తిగత క్రీడ కాదు. ఏడెనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ సహా 11 మంది ఆడే ఆట. వ్యక్తిగత ప్రదర్శనతో ఒకటీ, అరా మ్యాచ్‌లు గెలవచ్చేమో. కానీ, కప్‌ను సాధించలేం. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించాలి. జట్టును ఒడ్డున పడేసేందుకు అవసరమైతే సవాళ్లను స్వీకరించేందుకు నేనున్నానంటూ ముందుకురావాలి. టాపార్డర్‌ విఫలమైతే మిడిలార్డర్‌ బాధ్యత తీసుకోవాలి. ఆసియా కప్, వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌లో మా వాళ్లు ఇదే చేశారు. భారత్‌లో జరిగిన గత సిరీస్‌లలో అంబటి రాయుడు రాణించాడు. దినేశ్‌ కార్తీక్‌ సమయోచితంగా ఆడాడు.

ధోని ఎప్పుడూ కీలకమే. బ్యాటింగ్, బౌలింగ్‌తో కేదార్‌ జాదవ్‌ జట్టుకు సమతూకం తెచ్చాడు. పాండ్యా, జడేజా ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలను విస్మరించకూడదు. ఫినిషింగ్‌ టచ్‌ అనేది ఈ ఫార్మాట్‌లో అత్యంత కీలకం’ అని రోహిత్‌ విశ్లేషించాడు. వన్డేల్లో ఆసీస్‌ను తక్కువ అంచనా వేయరాదని భారత వైస్‌ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. ‘ప్రధాన పేసర్లు లేకుండానే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ ఆడనున్నా... మమ్మల్ని ఇబ్బందిపెట్టగల బౌలర్లు ఇంకా వారికున్నారు. 2016లో స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ లేకున్నా మేం 1–4తో ఓడిపోయాం. ఈసారి కూడా అంతే. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడితే మేం వారిని ఒత్తిడిలోకి నెట్టగలం’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.  

సిడ్నీలో టీమిండియా సాధన 
ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ గెలిచిన ఊపులో వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకోవాలని భావిస్తున్న టీమిండియా... సిడ్నీలో గురువారం ముమ్మరంగా సాధన చేసింది. శనివారం తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో జట్టు మొత్తం మైదానంలో దిగింది. బుధవారం ఐచ్ఛిక సాధన కావడంతో టెస్టు జట్టు సభ్యులు ప్రాక్టీస్‌కు రాలేదు. గురువారం మాత్రం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా ధోని, జడేజా, భువనేశ్వర్‌ తదితరులంతా గ్రౌండ్‌లో వార్మప్‌ చేశారు. ఫుట్‌బాల్‌ ఆడారు. ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌ నెట్స్‌లో బంతులను ఎదుర్కొన్నారు. కోహ్లి, పేసర్‌ ఖలీల్‌ క్యాచ్‌లు అందుకున్నారు. కుల్దీప్‌తో పాటు అంబటి రాయుడు బౌలింగ్‌ చేశారు. స్వదేశంలో ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదుడైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పెద్దగా ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. 

ధోని పాత్ర కీలకం... 
మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని రోహిత్‌ అన్నాడు. ప్రశాంత చిత్తంతో పనిచేసుకుపోయే అతడిని తమ ‘గైడింగ్‌ లైట్‌’గా అభివర్ణించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో, మైదానంలో ధోని ఉనికి ఎంతటి ప్రభావవంతమో కొన్నేళ్లుగా చూస్తున్నామని వివరించాడు. కీపర్‌గా అతడు కెప్టెన్‌కు చాలా ఉపయోగపడతాడని తెలిపాడు. రెండేళ్లుగా మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌ నిలకడగా రాణిస్తున్నారంటే దాని వెనుక ధోని సలహాలు, సూచనలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

‘పాత’ జెర్సీల్లో ఆస్ట్రేలియా 
భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ముదురు పసుపు రంగు జెర్సీలతో బరిలోకి దిగబోతోంది. వన్డేల్లో రంగుల దుస్తులు వచ్చిన కొత్తలో 1986లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన డ్రెస్‌ తరహాలోనే, సరిగ్గా అదే రంగుతో ఆసీస్‌ కిట్‌లు సిద్ధమయ్యాయి. మరో వైపు అనారోగ్యం కారణంగా మిషెల్‌ మార్ష్‌ తొలి వన్డేకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆస్టన్‌ టర్నర్‌ను ఎంపిక చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top