అశ్విన్‌ చేసింది కరెక్టే.. ధోనిది మాత్రం తప్పు!

Why Dhoni was wrong and  Ashwin was right, explains Taufel - Sakshi

సిడ్నీ: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువ చర్చనీయాంశమైన అంశాల్లో ఒకటి కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ చేసిన మన్కడింగ్‌ కాగా, రెండోది చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగడం. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ను అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఇది క్రికెట్‌ అభిమానుల మదిలో ఉండగానే నో బాల్‌ విషయంలో డగౌట్‌ నుంచి మరీ ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో ధోని వాదించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే అంపైర్లతో వాదనకు దిగడం క్రికెట్‌ మేధావుల నోటికి పని చెప్పింది.

అయితే నిబంధలన ప్రకారం ఏది కరెక్ట్‌.. ఏది కరెక్ట్‌ కాదు అనే విషయంపై ఐసీసీ కౌన్సిల్‌ మాజీ అంపైర్‌ సైమన్‌ టఫెల్‌ వివరణ ఇచ్చాడు. ఇక్కడ అశ్విన్‌ చేసిన పనికి టఫెల్‌ నుంచి మద్దతు రాగా, ధోని విషయంలో మాత్రం పెదవి విరిచాడు. ‘ నో బాల్‌ విషయంలో అంపైర్లే నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఫీల్డ్‌ అంపైర్లు ముందుగా నో బాల్‌ అని ప్రకటించారు. తర్వాత నో బాల్‌ కాదని తెలుసుకుని సరి చేసుకున్నారు. అటువంటి సమయంలో ధోని ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదం చేయడం సరికాదు. అది నిబంధనలకు విరుద్ధం. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు డగౌట్‌లో ఉన్న ప్లేయర్‌ గానీ, కోచ్‌ గానీ, మేనేజర్స్‌ గానీ ఫీల్డ్‌లోకి వెళ్లకూడదు. ఫీల్డ్‌లోకి ధోని వచ్చినప్పుడు అతన్ని అంపైర్లు ఎంటర్‌టైన్‌ చేయాల్సిన పనిలేదు. అక్కడ్నుంచి వెంటనే పంపించేయాలి. ఇందులో రెండో ప్రశ్నే లేదు. అసలు ధోనితో అంతసేపు చర్చించడమే అనవసరం’ అని టఫెల్‌ చెప్పుకొచ్చాడు.

ఇక అశ్విన్‌ మన్కడింగ్‌ విషయాన్ని మాత్రం ఈ దిగ్గజ అంపైర్‌ సమర్ధించాడు. అశ్విన్‌ చేసిన దాంట్లో ఎంతమాత్రం తప్పు లేదన్నాడు. దీనికి క్రీడా స్ఫూర్తి అనే ట్యాగ్‌ తగిలిచడం సరికాదన్నాడు. ‘ అశ్విన్‌ చేసింది నూటికి నూరుపాళ్లు సరైనదే. క్రికెట్‌ లా మేకర్‌ మెర్లిన్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) నిబంధనల ప్రకారం అశ్విన్‌ చేసింది కరెక్టే. ఎంసీసీ చట్టంలోని 41.16 నిబంధన ప్రకారం​ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లోని బ్యాట్స్‌మన్‌ బౌలర్‌ బంతిని వేసే వరకూ క్రీజ్‌ విడిచి వెళ్లకూడదు. అయితే ఇలా రనౌట్‌ చేయడానికి ముందు నాన్‌ స్టైకర్‌ బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలనడం మనం పెట్టుకున్నదే కానీ నిబంధనల్లో ఎక్కడా లేదు’ అని స్పష్టం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top