ఆంధ్ర పరాజయం

Syed Mushtaq Ali T20: Kerala Sandeep Warrier takes hat-trick against Andhra - Sakshi

సందీప్‌ వారియర్‌ హ్యాట్రిక్‌తో గెలిచిన కేరళ 

సాక్షి, విజయవాడ: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు తొలి పరాజయం చవిచూసింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా కేరళతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న కేరళ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్‌ విష్ణు వినోద్‌ (61 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్‌ రెడ్డి రెండు వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, ఇస్మాయిల్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది.

నాగాలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 179 పరుగుల తేడాతో గెలిచి టి20 చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆంధ్ర... కేరళపై 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. విజయానికి చివరి ఓవర్లో ఆంధ్ర జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా... కేరళ పేసర్‌ సందీప్‌ వారియర్‌ ‘హ్యాట్రిక్‌’తో ఆంధ్రను దెబ్బ తీశాడు. తొలి బంతికి పరుగు ఇవ్వని సందీప్‌ వారియర్‌ ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో శశికాంత్, కరణ్‌ శర్మ, ఇస్మాయిల్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ పూర్తి చేసుకోవడంతోపాటు కేరళను గెలిపించాడు. దాంతో ఆంధ్ర జట్టు 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర జట్టులో ప్రశాంత్‌ కుమార్‌ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top