‘చాలెంజ్‌’ నెగ్గిన సూపర్‌ నోవాస్‌ 

Supernovas clinch title after Harmanpreet special Against Velocity - Sakshi

హర్మన్‌ప్రీత్‌ మెరుపు ఇన్నింగ్స్‌

ఫైనల్లో వెలాసిటీ ఓటమి  

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో సూపర్‌ నోవాస్‌ ‘మహిళల టి20 చాలెంజ్‌’ విజేతగా నిలిచింది. ఆరంభంలో చక్కగా ఛేదించే పనిలో పడ్డ సూపర్‌ నోవాస్‌ అనూహ్యంగా 11 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మెరుపులు మెరిపించిన హర్మన్‌ ఆఖరి ఓవర్లో నిష్క్రమించింది. కాస్త ఉత్కంఠ రేపినా... రాధా యాదవ్‌ మిగతా లాంఛనాన్ని పూర్తి చేసింది.  

జైపూర్‌: ‘మహిళల టి20 చాలెంజ్‌’ ట్రోఫీని సూపర్‌ నోవాస్‌ నెగ్గింది. శనివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన నాలుగు వికెట్లతో మిథాలీ రాజ్‌ నాయకత్వంలోని వెలాసిటీపై విజయం సాధించింది. ముందుగా వెలాసిటీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. సుష్మ వర్మ (40 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. లియా తహుహు 2 వికెట్లు తీసింది. తర్వాత సూపర్‌ నోవాస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసి గెలిచింది. హర్మన్‌ప్రీత్‌ (37 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. విజేత సూపర్‌ నోవాస్‌ జట్టుకు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది.
 
ఖాతా తెరువకముందే కష్టాలు... 
సూపర్‌ నోవాస్‌ టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో వెలాసిటీ ఆట మొదలుపెట్టింది. కానీ... ఖాతా తెరువకముందే కష్టాల్లో పడింది. హేలీ మాథ్యూస్‌ (0), డానియెల్లి వ్యాట్‌ (0) డకౌటయ్యారు. షఫాలీ వర్మ (11), వేద (8), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (12) బ్యాట్లెత్తేయడంతో 37 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సుష్మ వర్మ, అమెలియా కెర్‌ (38 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఆరో వికెట్‌కు 71 పరుగులు జోడించడంతో స్కోరు వంద పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో సుష్మ ఓ భారీ సిక్సర్‌ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. 

చకచకా ఛేదన... 
తర్వాత లక్ష్యఛేదనలో సూపర్‌ నోవాస్‌ చకచకా పరుగులు చేసింది. రెండో ఓవర్లో జయాంగని (2) ఔటైనా... ప్రియా (31 బంతుల్లో 29; 5 ఫోర్లు), జెమీమా (25 బంతుల్లో 22; 3 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కానీ 53 పరుగుల వద్ద జెమీమా ఔటయ్యాక పరిస్థితి మారింది. స్వల్పవ్యవధిలో ప్రియా, స్కీవర్‌ (2), సోఫీ (3) ఔట్‌ కావడంతో 64 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ హర్మన్‌ అద్భుత పోరాటం చేసి జట్టును గెలిపించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top