జెమీమా ‘సూపర్‌’

Supernovas beat Velocity by 12 runs - Sakshi

ఫైనల్‌ చేరిన నోవాస్‌ 

12 పరుగులతో వెలాసిటీ ఓటమి 

అయినా తుది పోరుకు అర్హత  

ట్రయల్‌ బ్లేజర్స్‌ నిష్క్రమణ

జైపూర్‌:  మహిళల టి20 లీగ్‌లో సూపర్‌నోవాస్‌ ‘ఆఖరి’ విజయంతో ముందడుగు వేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో నోవాస్‌ 12 పరుగుల తేడాతో వెలాసిటీపై నెగ్గింది. మెరుగైన రన్‌రేట్‌తో సూపర్‌నోవాస్, వెలాసిటీ జట్లు ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి. ట్రయల్‌బ్లేజర్స్‌ కథ లీగ్‌ దశలోనే ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌ నోవాస్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా రోడ్రిగ్స్‌ (48 బం తుల్లో 77 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధసెంచరీ సాధించింది. అమెలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెలాసిటీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులు చేసి ఓడింది. డానియెల్లి వ్యాట్‌  (33 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్‌ (42 బంతుల్లో 40 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. సూపర్‌నోవాస్, వెలాసిటీల మధ్య రేపు ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. 

జెమీమా ధాటిగా... 
టాస్‌ నెగ్గిన వెలాసిటీ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపింది. ప్రియా పూనియాతో కలిసి సూపర్‌నోవాస్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన జయంగని ఆరంభంలో బౌండరీలతో ఆకట్టుకుంది. ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన పూనియా (16; 2 ఫోర్లు)ను శిఖాపాండే పెవిలియన్‌ చేర్చింది. 29 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోవడంతో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్‌ సూపర్‌ నోవాస్‌కు వెన్నెముకగా నిలిచింది. జయంగనితో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించింది. తర్వాత జయంగని (38 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఔటయ్యాక... సోఫీ డివైన్‌తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఫోర్లతో వేగం పెంచిన జెమిమా ఈ క్రమంలో 31 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు డివైన్‌ మాత్రం ధాటిగా ఆడలేకపోయింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (1 నాటౌట్‌) క్రీజులోకి వచ్చినప్పటికీ ఆఖరి ఓవర్లో చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయింది. 

ఆరంభంలోనే తడబాటు 
అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెలాసిటీ తడబడింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఓపెనర్, టీనేజీ బ్యాట్స్‌మన్‌ షఫాలీ వర్మ (2), 22 వద్ద హేలీ మాథ్యూస్‌ (11) పెవిలియన్‌ చేరడంతో వెలాసిటీ కష్టాల్లో పడింది. ఈ దశలో డానియెల్లీ వ్యాట్, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నారు. వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ మిథాలీ నింపాదిగా ఆడుతుంటే... వ్యాట్‌ రెండు భారీ సిక్సర్లతో మెరిపించింది. ఇద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. పది ఓవర్లు ముగిసేసరికి వెలాసిటీ స్కోరు 68/2. మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించిన వ్యాట్‌... పూనమ్‌ ఓవర్లో క్లీన్‌బౌల్డయింది. తర్వాత మిథాలీకి వేద కృష్ణమూర్తి (29 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు) తోడైంది. కానీ పరుగుల రాక మందగించడంతో చేయాల్సిన లక్ష్యం పెరుగుతూ పోయింది. వెలాసిటీ విజయానికి 30 బంతుల్లో 51 పరుగులు చేయాలి. అయితే సూపర్‌ నోవాస్‌ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్‌ చేయడంతో భారీషాట్లకు అవకాశం లేకపోయింది. ఆఖరి 6 బంతులకు 23 పరుగులు చేయాల్సివుండగా... 10 పరుగులే చేసి ఓడింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top