సన్‌రైజర్స్‌కు పరీక్ష

Sunrisers Hyderabad Match With Kings Eleven Punjab in Uppal - Sakshi

నేడు ఉప్పల్‌ మైదానంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌

గెలుపే లక్ష్యంగా బరిలోకి వార్నర్‌కు ఇదే చివరి మ్యాచ్‌

సాక్షి, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు గెలుపే లక్ష్యంగా సోమవారం బరిలో దిగనున్నాయి. ఎలాగైన ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను పటిష్టం చేసుకోవాలని ఇరు జట్ల ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.

వార్నర్‌ చివరి మ్యాచ్‌...
సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో వార్నర్, బెయిర్‌స్టో జంట అద్భుత ఓపెనింగ్‌ భాగస్వామ్యమే ఐదు మ్యాచ్‌ల్లో విజయాలను అందించింది. ఇప్పటికే బెయిర్‌స్టో జట్టు నుంచి వైదొలగగా... వార్నర్‌కు ఈ మ్యాచే ఈ సీజన్‌లో చివరిది కానుంది. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన వార్నర్‌ తమ జాతీయ జట్టుతో కలిసేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. ఈ సీజన్‌లో సెంచరీతో సహా 7 అర్ధసెంచరీలు నమోదు చేయడం వార్నర్‌ విలువను చూపిస్తోంది. అత్యధిక పరుగుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వార్నర్‌ (611), బెయిర్‌స్టో (445) కీలక సమయంలో జట్టుకు దూరమవడంతో ప్లే ఆఫ్స్‌ ముందర రైజర్స్‌పై ఒత్తిడి అధికమైంది. రైజర్స్‌ ఓడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ మిడిలార్డర్‌ వైఫల్యం... డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ తడబాటు స్పష్టంగా కనబడుతోంది. వార్నర్‌ స్థానంలో ఓపెనింగ్‌ చేస్తోన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇప్పటివరకు తన స్థాయిని ప్రదర్శించలేదు. విజయ్‌ శంకర్, దీపక్‌ హుడా బ్యాట్‌ ఝళిపించలేకపోతున్నారు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్‌ మనీశ్‌ పాండే ఆకట్టుకున్నాడు. ఇది రైజర్స్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం. షకీబుల్‌ హసన్‌ కూడా ఇప్పటివరకు ఒక్క కీలక ఇన్నింగ్స్‌ ఆడలేదు. నబీ, రషీద్‌ ఖాన్, భువనేశ్వర్, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌తో కూడిన పటిష్ట బౌలింగ్‌ విభాగం మ్యాచ్‌ మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయలేకపోతోంది. డెత్‌ ఓవర్లలోనూ హైదరాబాద్‌ బౌలర్ల ఆధిపత్యం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని సన్‌ భావిస్తోంది. 

గేల్, రాహుల్‌ చెలరేగితే...  
సన్‌రైజర్స్‌ తరహాలోనే పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టులో కూడా టాపార్డరే ఎక్కువగా రాణిస్తోంది.  విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ (444 పరుగులు), కేఎల్‌ రాహుల్‌ (441 పరుగులు) ఆ జట్టుకు పరుగులు సాధించి పెడుతున్నారు. వీరిద్దరూ బ్యాట్‌తో చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. మయాంక్‌ అగర్వాల్‌ (262) పరవాలేదనిపిస్తుండగా... డేవిడ్‌ మిల్లర్‌ (9 మ్యాచ్‌ల్లో 202 పరుగులు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (8 మ్యాచ్‌ల్లో 180 పరుగులు) భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నారు. అయితే ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో యువ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ ప్రదర్శన జట్టు గెలుపుపై ఆశలు రేకెత్తిస్తోంది. సన్‌రైజర్స్‌ మిడిలార్డర్‌ బలహీనతపై దెబ్బకొట్టాలని భావిస్తోన్న కెప్టె న్‌ రవిచంద్రన్‌ అశ్విన్, పేసర్‌ మొహమ్మద్‌ షమీ అందుకు సిద్ధమై మ్యాచ్‌ బరిలో దిగనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top