కొత్త సౌరభం వీస్తుందా!

Sourav Ganguly Takes Over As BCCI President - Sakshi

సాక్షి క్రీడావిభాగం: భారత క్రికెట్‌ కెప్టెన్‌గానే గొప్ప విజయాలు సాధించిన సౌరవ్‌ గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష పదవి ద్వారా కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతులేమీ లేవు. ఆటగాడిగా కాకుండా అధికారిక హోదాలో ఏదైనా చేయాలనే పట్టుదల చాలా కాలంగా అతనిలో కనిపించింది. అదే అతడిని బోర్డు వైపు నడిపించింది. అందుబాటులో ఉన్న 9 నెలల కాలంలోనే తనదైన ముద్ర వేయాలని గంగూలీ తపిస్తున్నాడు. ఈ క్రమంలో అతని ముందు కొన్ని ప్రధాన సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమించే సత్తా కూడా మాజీ సారథిలో ఉంది.
 
►రంజీ క్రికెట్‌కు ప్రాధాన్యత పెంచడం గురించి గంగూలీ గతంలో చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడు ఒక రంజీ మ్యాచ్‌ ఆడితే క్రికెటర్‌కు రూ. లక్షా 40 వేలు లభిస్తాయి. దీనిని రూ.2 లక్షల 50 వేలకు పెంచాలని గంగూలీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  

►ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ అవకాశం కల్పించడం వల్ల జట్ల సంఖ్య 38కి పెరగడంతో పాటు నాణ్యత కూడా పడిపోయింది. దీనిని అధిగమించి దేశవాళీ క్రికెట్‌కు మళ్లీ గుర్తింపు తీసుకురావడం అంత సులువు కాదు.  

►దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి పేలవ స్పందన లభించింది. భారత్‌లో టెస్టులను ఆకర్షణీయంగా మార్చేందుకు తన పదవీ కాలంలో డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లు నిర్వహించే ప్రయత్నం చేయగలడా చూడాలి.  

►అర్థం పర్థం లేని ‘కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’ నిబంధనను తొలగించి వీలైనంత ఎక్కువ మంది క్రికెటర్లను పరిపాలనలో భాగం చేయాలని సౌరవ్‌ భావిస్తున్నాడు. ఈ విషయంలో నిబంధనలను రూపొందించిన సుప్రీం కోర్టును ఒప్పించడం పెద్ద సమస్య.  

►ఐసీసీలో ఇటీవల బీసీసీఐ ప్రాధాన్యత కొంత తగ్గిపోయింది. భారత క్రికెట్‌ నుంచే భారీ ఆదాయం సమకూరుతున్నా ఐసీసీ నుంచి తమకు పెద్ద మొత్తం తిరిగి రావడం లేదనేది ప్రధాన ఫిర్యాదు. దీనిపై దాదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.  

ఇక ఆసక్తికరం.. ఆకర్షణీయం...
గత మూడేళ్లుగా భారత క్రికెట్‌లో కెప్టెన్‌ కోహ్లి ఆడిందే ఆటగా సాగింది. బోర్డులో సరైన వ్యవస్థ లేకపోగా, సీఓఏకు అనుభవం లేకపోవడంతో కోహ్లినే దాదాపుగా అంతా తానే నడిపించాడు. కోచ్‌గా కుంబ్లేను తప్పించి తనకు నచ్చిన రవిశాస్త్రిని ఎంచుకోగలగడం అందులో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పైకి చెప్పకపోయినా గంగూలీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు అంతర్గత సమాచారం. గతంలో భారత కెపె్టన్లు అద్భుతాలు చేసిన సమయంలోనూ వారు బోర్డు వ్యవహారాల్లో కలిపించుకోలేదు.

జగ్మోహన్‌ దాల్మియా, శ్రీనివాసన్‌లాంటి వారు ఆటగాళ్లకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తూనే బోర్డును శాసించగలిగారు. గంగూలీకి ఇదంతా తెలుసు. బోర్డు సభ్యులు, సంఘాలు, సెలక్టర్లు నామమాత్రంగా మిగిలిపోకుండా వారికి తగిన ప్రాధాన్యత కల్పించడం కూడా ముఖ్యమని సౌరవ్‌ నమ్ముతున్నాడు. వరుస విజయాలు సాధిస్తున్నా సరే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు జవాబుదారీగా ఉండాలని అతను భావిస్తున్నాడు. కాబట్టి ఇకపై భారత కెపె్టన్‌–కోచ్‌ ద్వయం ఇష్టారాజ్యం మాత్రం ఉండకపోవచ్చు. మొత్తంగా రాబోయే రోజుల్లో భారత క్రికెట్, క్రికెట్‌ పరిపాలన రెండూ ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉండటం మాత్రం ఖాయం.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top