దాంతో పోలిస్తే ఇది చిన్న సమస్యే! 

This is a small problem- Sunil Gavaskar - Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

భారత జట్టును ఓడించాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెస్టిండీస్‌ ఉంది. నిజానికి వారు తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదు చేశారు. సాధారణంగా ఈ స్కోరును ఏ జట్టయినా కాపాడుకోగలదు కానీ పేలవమైన విండీస్‌ బౌలింగ్‌కు అది సాధ్యం కాలేదు. ఫలితంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన గువాహటి పిచ్‌పై భారత్‌ కేవలం 2 వికెట్లే కోల్పోయి 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి చెలరేగిపోతున్నప్పుడు ప్రపంచంలో ఏ బౌలింగ్‌ దళమైనా వారిని అడ్డుకోవడం కష్టమని అందరూ చెప్పే మాట. అయితే ఈ పరాజయానికి విండీస్‌ తమను తాము నిందించుకోవాలి. ఇన్నింగ్స్‌ కీలక దశలో వారి బ్యాట్స్‌మెన్‌ అనవసరపు షాట్లు ఆడి ఔట్‌ కావడంతో కనీసం మరో 20–30 అదనపు పరుగులు చేసే అవకాశం పోయింది. అదే జరిగితే పరిస్థితి వారికి కొంత అనుకూలంగా ఉండేదేమో. అర్ధ సెంచరీ కాగానే కీరన్‌ పావెల్‌ తన వికెట్‌ పారేసుకోగా... షై హోప్, రావ్‌మన్‌ పావెల్‌ కూడా అదే చే?శారు. ఆ స్థితిలో వారు స్కోరు బోర్డుపై కాస్త దృష్టి పెట్టి ఎన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయో చూస్తే అలాంటి చెత్త షాట్లు ఆడకపోయేవారు.

రోహిత్‌ శర్మ, కోహ్లిలను చూసి ఆ జట్టు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా భారత కెప్టెన్‌ సెంచరీ పూర్తయిన తర్వాత గానీ గాల్లోకి షాట్‌ ఆడలేదు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇద్దరు వేగం తగ్గించకుండానే సరిగ్గా లక్ష్యంపై గురి పెట్టి ఆడారు. కొన్ని సందర్భాల్లో ఫీల్డింగ్‌ పేలవంగా ఉండటమే భారత్‌ను కొంత వరకు ఆందోళన పరిచే అంశం. మామూలుగానైతే  గ్రౌండ్‌ ఫీల్డింగ్‌లో మన జట్టు ప్రమాణాలు చాలా బాగానే ఉన్నాయి. అయితే గువాహటిలో ఎందుకో అది కనిపించలేదు.  వైజాగ్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. కాబట్టి బౌలర్లు గత మ్యాచ్‌లోలాగా భారీగా పరుగులు ఇచ్చుకునే ప్రమాదం లేదు. వారు నేర్చుకునే క్రమంలో గువాహటిలాంటి అనుభవం కూడా అవసరం. భారత జట్టు కుల్దీప్‌ను ఆడిస్తుందా? గువాహటిలో అద్భుత సెంచరీ బాదిన హెట్‌మైర్‌ టెస్టుల్లో మూడు సార్లు ఈ లెఫ్టార్మ్‌ చైనామన్‌ బౌలర్‌కే ఔటయ్యాడు. అతని కోసం ఎవరిని తప్పించాలనేది మేనేజ్‌మెంట్‌ ముందున్న పెద్ద సమస్య. అయితే ఎవరిని ఎంచుకోవాలనే ఇబ్బంది ఉండటంకంటే ఇలాంటి పరిస్థితి ఉండటం మంచిదే కదా.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top