‘దాదా..ఇక సెలక్షన్‌ ప్యానల్‌ను మార్చండి’

Selection Panel Needs To Be Changed Harbhajan - Sakshi

న్యూఢిల్లీ: ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ ప్యానల్‌ను మార్చేయాలని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ డిమాండ్‌ చేశాడు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కల్పించుకోవాలన్నాడు.  భారత క్రికెట్‌ జట్టుకు  ఇక బలమైన సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసే సమయం ఆసన్నమైందన్నాడు. ఈ విషయంలో గంగూలీ చొరవ తీసుకుంటాడని ఆశిస్తున్నట్లు భజ్జీ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో త్వరలో ఆరంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా భారత యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ‘ ఎంతో కాలంగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌కు ఎంపిక చేయకపోవడం నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కనీసం  చాన్స్‌ కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఎంపిక చేసినా తుది జట్టులో శాంసన్‌ ఉండటం లేదు. మూడు టీ20లకు డ్రింక్స్‌ ఇవ్వడం వరకే పరిమితం చేశారు కానీ జట్టులో అవకాశం ఇవ్వకుండా విస్మరించారు. అతన్ని బ్యాటింగ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా.. లేక అతని హృదయాన్ని టెస్టు చేయాలనుకుంటున్నారా’ అని శశి థరూర్‌ మండిపడ్డారు. దీనికి బదులు ఇచ్చిన భజ్జీ..  భారత సెలక్షన్‌ కమిటీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నాడు. ‘ నేను అనుకోవడం శాంసన్‌ హృదయాన్ని టెస్టు చేయాలనే అనుకుంటున్నారు. సెలక్షన్‌ ప్యానల్‌ను మార్చాలి. పటిష్టమైన సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. దాదా.. అందుకు చర్యలు తీసుకుంటాడనే ఆశిస్తున్నా’ అని థరూర్‌ ట్వీట్‌కు భజ్జీ రిప్లై ఇచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top