ఆఖరికి వాళ్లు కూడా ధోనిని విమర్శిస్తున్నారు!

Sanjay Jagdale Says Teamindia Has No Viable Alternative To Dhoni - Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుతం టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడని బీసీసీఐ మాజీ కార్యదర్శి, మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్దాలే అభిప్రాయపడ్డాడు. జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆడిన ధోనికి రిటైర్‌మెంట్‌ విషయంలో పూర్తి స్వేచ్చనివ్వాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలో సంజయ్‌ మాట్లాడుతూ...‘ నా దృష్టిలో ధోని గొప్ప ఆటగాడు. తను దేశం కోసం ఆడాడు. ఒక వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా ధోని స్థానాన్ని భర్తీ చేయగల, అతడికి ప్రత్యామ్నాయం కాగల ఆటగాడు ప్రస్తుత జట్టులో లేడు. ఇక రిటైర్‌మెంట్‌ గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకోగల పరిణతి ధోనికి ఉంది. తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి సెలక్టర్లు అతడితో మాట్లాడితే బాగుంటుంది. రిటైర్‌మెంట్‌కు ముందు సచిన్‌ టెండూల్కర్‌ విషయంలో సెలక్టర్లు ఎలా వ్యవహరించారో ధోని విషయంలో కూడా అదే పంథా అనుసరించాలి. ధోని నుంచి ఎటువంటి ప్రదర్శన ఆశిస్తున్నారో అతడికి వివరించాలి’ అని అభిప్రాయపడ్డాడు.

ఇప్పుడు కూడా అలాగే అంటే ఎలా?
వరల్డ్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని రనౌట్‌ కావడం గురించి సంజయ్‌ ప్రస్తావిస్తూ...‘ జట్టు ప్రయోజనాలకు, పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచకప్‌లో ధోని శక్తి మేరకు రాణించాడు. సెమీ ఫైనల్‌లో కూడా అతడు వ్యూహాత్మకంగానే మైదానంలోకి దిగాడు. అయితే దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. దీంతో తమ కెరీర్‌లో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేని ఆటగాళ్లు కూడా అతడిని విమర్శిస్తున్నా‍రు. ఈ ఒక్క కారణంగా ధోని ఆట ముగియాలనుకోవడం సరైంది కాదు. అయినా ధోని విలువ వారికి తెలియకపోయినా భవిష్యత్‌ తరం ఆటగాళ్లు మాత్రం ఈ విషయాన్ని తప్పక గుర్తిస్తారు. నిజానికి 38 ఏళ్ల వయస్సులో కూడా కెరీర్‌ అత్యున్నత స్థాయి ప్రదర్శన అతడి నుంచి ఆశించడం సరైంది కాదేమో. ఇక యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌ నుంచి జట్టుతో ఉండి ఉంటే బాగుండేది. ధోని నుంచి వికెట్‌ కీపింగ్‌ పాఠాలు నేర్చుకునేవాడు’ అని చెప్పుకొచ్చాడు.

కాగా ఇక ఆదివారం వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సమావేశమవుతున్నారు. దీంతో ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకుపెడతారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి కొంత కాలం క్రికెట్‌ ఆడటానికి ధోని ఇష్టపడుతుండటంతో అతడిపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top