
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్‌లో బెంగళూరు రాప్టర్స్ ఫైనల్‌కు చేరింది. తొలి సెమీఫైనల్లో బెంగళూరు 4–2తో అవధ్ వారియర్స్‌ను ఓడించింది. సెమీస్‌లో తొలి మ్యాచ్ మిక్స్‌డ్ డబుల్స్‌ను అవధ్ ‘ట్రంప్’గా ఎంచుకుంది. మథియాస్ క్రిస్టియన్సెన్–అశ్విని పొన్పప్ప (అవధ్) జోడీ 15–7, 15–10తో మార్కస్ ఎలిస్–లారెన్ స్మిత్ జంటపై గెలుపొంది 2–0తో ముందంజ వేసింది.
అయితే, పురుషుల తొలి సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 15–9, 15–4తో లి డాంగ్ కుయెన్‌ను, రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్ 15–7, 15–10తో సన్ వాన్ హోను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. తమ ‘ట్రంప్’ మ్యాచ్ పురుషుల డబుల్స్‌లో అహసాన్–సెటియవాన్ జంట 15–14, 15–9తో యాంగ్ లీ–క్రిస్టియన్సెన్ జోడీపై నెగ్గడంతో బెంగళూరు 4–2తో విజయాన్ని ఖాయం చేసుంది. నేడు జరిగే రెండో సెమీస్‌లో హైదరాబాద్ హంటర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది.