రన్నరప్‌తో సరి | runner-up is OK | Sakshi
Sakshi News home page

రన్నరప్‌తో సరి

Nov 16 2015 12:11 AM | Updated on Sep 3 2017 12:32 PM

రన్నరప్‌తో సరి

రన్నరప్‌తో సరి

వరుసగా రెండో ఏడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది.

చైనా ఓపెన్ ఫైనల్లో లీ జురుయ్ చేతిలో సైనా ఓటమి
 
 ఫుజౌ (చైనా): వరుసగా రెండో ఏడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఓటమి చవిచూసింది. లండన్ ఒలింపిక్స్ విజేత, ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)తో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సైనా 12-21, 15-21తో పరాజయం పాలైంది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ తుది పోరులో సైనా పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలిచిన లీ జురుయ్‌కు 52 వేల 500 డాలర్లు (రూ. 34 లక్షల 70 వేలు), రన్నరప్ సైనా నెహ్వాల్‌కు 26 వేల 600 డాలర్లు (రూ. 17 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా తుది సమరంలో మాత్రం తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌కు ముందు సైనాను తొమ్మిది సార్లు ఓడించిన అనుభవం ఉన్న లీ జురుయ్ ఈసారీ పక్కా ప్రణాళికతో ఆడి భారత స్టార్ ఆట కట్టించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సైనా తొలి గేమ్ మొదట్లో 4-1తో ముందంజ వేసింది. అయితే సొంత ప్రేక్షకుల సమక్షంలో ఆడిన లీ జురుయ్ వెంటనే తేరుకొని ఆరు పాయింట్లు స్కోరు చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ చైనా స్టార్ వెనుదిరిగి చూడలేదు. నిలకడగా పాయింట్లు సాధిస్తూ తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో సొంతం చేసుకుంది.

 రెండో గేమ్‌లో సైనా కొలుకున్నట్లు కనిపించింది. డ్రాప్ షాట్‌లు, స్మాష్ షాట్‌లతో చెలరేగిన ఈ భారత స్టార్ 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సైనా ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న లీ జురుయ్ ఒక్కసారిగా విజృంభించింది. వరుసగా ఏడు పాయింట్లు సాధించి 13-12తో ఆధిక్యంలోకి వచ్చింది. భారీ ఆధిక్యాన్ని కోల్పోయిన సైనా ఈ దశలో డీలా పడింది. అనవసర తప్పిదాలు చేసి ఓటమిని ఖాయం చేసుకుంది.

 తాజా ఫలితంతో లీ జురుయ్‌తో ముఖాముఖి రికార్డులో సైనా 2-10తో వెనుకబడింది. చివరిసారి 2012 ఇండోనేసియా ఓపెన్‌లో లీ జురుయ్‌ను ఓడించిన సైనా ఆ తర్వాత ఆమెతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకొని ఓడిపోవడం సైనాకిది నాలుగోసారి. గతంలో సైనా ఇండోనేసియా ఓపెన్ (2011), ఫ్రెంచ్ ఓపెన్ (2012), ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (2015) టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది.
 
రెండు గేముల్లో శుభారంభం చేశాను. అయితే దానిని నిలబెట్టుకోలేకపోయాను. ఫైనల్లో నా ఆటతీరుపట్ల నాకే ఆశ్చర్యమేసింది. షటిల్స్‌ను నియంత్రించలేకపోయాను. నేను కొట్టిన చాలా షాట్‌లు బయటకు వెళ్లాయి. మరోవైపు లీ జురుయ్ పక్కాగా ఆడింది. పాయింట్లను తొందరగా సాధించాలనే తాపత్రయంలో చాలా పొరపాట్లు చేశాను. నేనింకా కాస్త సంయమనంతో ఆడాల్సింది. ఈ టోర్నీకి సన్నద్ధం కావడానికి తగినంత సమయం లేకపోయినా, నా ఆటతీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను.                  

- సైనా నెహ్వాల్
 

Advertisement
 
Advertisement
Advertisement