మా జట్టు పటిష్టంగా మారింది

Premier Badminton League - sai praneeth  - Sakshi

మంచి విజయావకాశాలున్నాయి

హైదరాబాద్‌ హంటర్స్‌  స్టార్‌ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి జరిగే ఈ టోర్నీలో హైదరాబాద్‌ హంటర్స్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హంటర్స్‌ టీమ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. గత ఏడాది లీగ్‌ దశలో నిలకడగానే ఆడినా చివర్లో విఫలమైన హంటర్స్‌ సెమీఫైనల్‌ అవకాశం కోల్పోయింది. అయితే ఈసారి తమ జట్టు మరింత పటిష్టంగా మారిందని, జట్టుకు మంచి విజయావకాశాలు ఉన్నాయని కీలక ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్‌ అన్నాడు. ముఖ్యంగా పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు లీ హ్యున్‌ ఇల్‌ (దక్షిణ కొరియా), డబుల్స్‌లో ఒలింపిక్స్‌ స్వర్ణపతక విజేత, ప్రపంచ చాంపియన్‌ మార్కిస్‌ కిడో (ఇండోనేసియా) రావడం జట్టు బలాన్ని పెంచింది. ‘లీ హ్యున్, కిడో జట్టుకు అదనపు బలం. కరోలినా మారిన్‌లాంటి స్టార్‌ కూడా జట్టుతో ఉంది. ఈసారి మా రాత మారుతుందని గట్టిగా నమ్ముతున్నా.

ముందుగా సెమీఫైనల్‌ చేరుకోవడంపైనే దృష్టి పెట్టాం. ఆ తర్వాత ఫైనల్, ఆపై టైటిల్‌’ అని ఈ ఏడాది సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన సాయిప్రణీత్‌ వ్యాఖ్యానించాడు. వరుసగా రెండో ఏడాది హంటర్స్‌ జట్టుతో కొనసాగడం సంతోషంగా ఉందని... హైదరాబాద్‌ అభిమానులు సొంతగడ్డపై తమ జట్టు సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లు చూసేలా తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని అతను చెప్పాడు. డబుల్స్‌లో బలమైన జట్టు ఉండటం తమకు ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన అవకాశాన్ని కల్పిస్తోందని హంటర్స్‌ కోచ్‌ రాజేంద్ర కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జట్టు సభ్యులు సాత్విక్‌ సాయిరాజ్, రాహుల్‌ యాదవ్‌లతో పాటు టీమ్‌ యజమాని డాక్టర్‌ వీఆర్‌కే రావు, సీఈఓ శ్యామ్‌ గోపు తదితరులు పాల్గొన్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top