రిషభ్‌ పంత్‌ వచ్చేశాడు..

Pant World Cup debut for India As England bat - Sakshi

బర్మింగ్‌హామ్‌:  వరల్డ్‌కప్‌లోలో ఓటమనేదే లేకుండా దూసుకెళుతున్న భారత్‌ మరో విజయంపై కన్నేసింది. ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడుతున్న భారత్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అదే జరిగితే ఈ మ్యాచ్‌తోనే టీమిండియా సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంటుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ఉన్న భారత్‌ ప్రస్తుతం 11 పాయింట్లతో ఉంది. కివీస్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఆసీస్‌ ఇప్పటికే 12 పాయింట్లతో సెమీ్‌సకు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈనేపథ్యంలో సూపర్‌ సండే మ్యాచ్‌లో పటిష్ఠ ఇంగ్లండ్‌ను భారత్‌ ఎదుర్కొనబోతోంది. జట్టులోని బలహీనతలను సరిచేసుకుంటూ ఈ మ్యాచ్‌లో పంజా విసరాలని చూస్తోంది. అయితే నేటి పోరు ప్రధానంగా ఆతిథ్య జట్టుకే చాలా ముఖ్యమైనది. మిగిలిన ఈ రెండు మ్యాచ్‌ల్లో మోర్గాన్‌ సేన చావో రేవో తేల్చుకోవాల్సిందే. అందుకే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ జారవిడుచుకోకూడదనే కసితో ఉంది. అటు భారత్‌ కూడా తమ శక్తిమేరా ఆడాల్సి ఉంటుంది.

ఈ ప్రపంచక్‌పలో ఏ జట్టయినా 500 చేయగలదంటే అది ఇంగ్లండ్‌ మాత్రమే. టోర్నీ ఆరంభానికి ముందు అందరికీ ఉన్న అంచనాలివి. కానీ ఎవరూ ఊహించని విధంగా మూడు ఓటములతో ఇంగ్లండ్‌కు గెలిస్తేనే సెమీస్‌ రేసులో నిలిచే స్థితి నెలకొంది. తొలి టైటిల్‌ను సాధించే క్రమంలో సొంత గడ్డపై టోర్నీ నల్లేరుపై నడకే అనుకుంటే పాక్‌, శ్రీలంక, ఆసీస్‌ ఇచ్చిన షాక్‌లతో దిమ్మతిరిగింది. ఇంత ఒత్తిడిలో బరిలోకి దిగబోతున్న ఆతిథ్య జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక తమ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ జట్టులో చేరడంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ బలం పెరిగింది. ఇక భారత్‌ తుది జట్టులో యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు చోటు దక్కింది. విజయ్‌ శంకర్‌ను తప్పించిన యాజమాన్యం.. రిషభ్‌ పంత్‌కు అవకాశం కల్పించింది. ఇది రిషభ్‌కు తొలి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌‌. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు.

తుది జట్లు

 ఇంగ్లండ్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌, ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌

భారత్‌
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌, బుమ్రా


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top