ఫుట్‌బాల్‌ దిగ్గజం  జుల్ఫికర్‌ అస్తమయం

National Senior Championship Mohammad Zulfiqiruddin Koon died - Sakshi

1956 ఒలింపిక్స్‌లో ఆడిన హైదరాబాదీ

సాక్షి, హైదరాబాద్‌: భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మొహమ్మద్‌ జుల్ఫికరుద్దీన్‌ (83) ఆదివారం కన్ను మూశారు. సుదీర్ఘ కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరిన భారత జట్టులో జుల్ఫికర్‌ సభ్యుడుగా ఉన్నారు. ఈ టీమ్‌లో 17 ఏళ్ల జుల్ఫికర్‌ సహా మొత్తం ఆరుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉండటం విశేషం. మలేసియాలో జరిగిన మెర్డెకా కప్‌తో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జుల్ఫికర్‌ 1958 టోక్యో ఆసియా క్రీడల్లో కూడా పాల్గొన్నారు.  

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ తరఫున... 
జుల్ఫికర్‌ 1954లో హైదరాబాద్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ తరఫున కెరీర్‌ ప్రారంభించి ప్రఖ్యాత కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ (ఎస్‌ఏ) రహీమ్‌ శిక్షణలో రాటుదేలారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ జట్టులో చేరారు. 1954 నుంచి 1967 మధ్య కాలంలో ఆయన వరుసగా అటు ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు, ఇటు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించారు. జుల్ఫికర్‌ నాయకత్వంలో ఏపీ మూడు సార్లు (1956, 1957, 1965) జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ సంతోష్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆయన 15 గోల్స్‌ చేశారు.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ జట్టుకు కూడా కెప్టెన్‌గా ఐఎఫ్‌ఏ షీల్డ్, డ్యురాండ్‌ కప్, రోవర్స్‌ కప్‌వంటి ప్రఖ్యాత టైటిల్స్‌ను అందించారు. జుల్ఫికర్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌... ఆటకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రఫత్‌ అలీ, జి.ఫల్గుణలతో పాటు మాజీ క్రీడాకారులు ఎస్‌ఏ హకీమ్, విక్టర్‌ అమల్‌రాజ్, అక్బర్,  హబీబ్, అలీమ్‌ ఖాన్‌ సంతాపం ప్రకటించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top