
ఎల్లో మే ఖేలో!
ఫుట్‌బాల్ అభిమానులకు సచిన్ పిలుపు ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పుడు తన ఫుట్‌బాల్ జట్టు ప్రచార కార్యక్రమంలో బిజీగా మారాడు.
ఫుట్‌బాల్ అభిమానులకు సచిన్ పిలుపు
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పుడు తన ఫుట్‌బాల్ జట్టు ప్రచార కార్యక్రమంలో బిజీగా మారాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌లో కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని అయిన సచిన్... తమ జట్టుకు మద్దతివ్వాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చాడు. బ్లాస్టర్స్ జెర్సీ రంగు పసుపును హైలైట్ చేసే విధంగా ‘ఎల్లో మే ఖేలో’ అంటూ టెండూల్కర్ సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా ప్రచారం చేస్తున్నాడు. దీని ప్రకారం జట్టు అభిమానులు పసుపు రంగు దుస్తులు ధరించి ఆ ఫోటో (లేదా సెల్ఫీ)ను బ్లాస్టర్స్ అధికారిక సైట్‌లో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘ఎల్లో మన కలర్. ఈ రంగులో ఉన్న ఫోటోలు పంపి కేరళ బ్లాస్టర్స్ జట్టుకు మద్దతు పలకండి’ అంటూ సచిన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
కొరియన్లకూ మాస్టరే ఆదర్శం...
మరోవైపు ఇంచియాన్ ఆసియా క్రీడల్లో క్రికెట్‌లో పతకం గెలుచుకోవాలని ఆశిస్తున్న దక్షిణ కొరియా మహిళల జట్టు కూడా సచిన్‌నే ఆదర్శంగా తీసుకుంది. కొరియా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ జాతీయుడు నాసిర్ ఖాన్ ఇప్పుడు ఆ జట్టులో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం అతను సచిన్ టెండూల్కర్ ఆడిన వీడియోలను వారికి చూపిస్తున్నాడు. అది చూసి ఉన్‌జున్ లీ అనే 21 ఏళ్ల క్రికెటర్ ఏకంగా సచిన్‌నే అనుకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. సచిన్ తరహాలో బ్యాక్ లిఫ్ట్ షాట్ ఆడే ప్రయత్నం చేస్తోంది!