ఇటలీ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు మార్కో మటెరాజి ఇప్పుడు భారత అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ (ఐఎస్‌ఎల్)లో అతను చెన్నై టైటాన్స్ తరఫున ఆడనున్నాడు.
చెన్నై తరఫున ఆడే అవకాశం
న్యూఢిల్లీ : ఇటలీ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు మార్కో మటెరాజి ఇప్పుడు భారత అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ (ఐఎస్‌ఎల్)లో అతను చెన్నై టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. ఆ జట్టుకు తనే మేనేజర్‌గానూ వ్యవహరించే అవకాశం ఉంది. చెన్నై జట్టు ప్రతినిధులు ఇటీవలే రోమ్‌కు వెళ్లి మటెరాజితో చర్చించారు.
అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోయినా చెన్నై ఆఫర్‌ను ఈ మాజీ స్టార్ ఆటగాడు అంగీకరించినట్లు సమాచారం. గత మే నెలలో అతను ఇంటర్ మిలాన్ క్లబ్ ప్రతినిధిగా భారత్‌కు వచ్చినప్పుడు బెంగళూరు సన్‌గ్రూప్ ప్రతినిధులు అతనితో చర్చించారు. అయితే ఇప్పుడు ఐఎస్‌ఎల్ బరినుంచి సన్ తప్పుకోవడంతో చెన్నై జట్టు అతనిపై దృష్టి పెట్టింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మటెరాజిని 2006 ప్రపంచకప్‌లో జినెదిన్ జిదాన్ (ఫ్రాన్స్) తలతో కుమ్మిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.