పంజాబ్‌ ఆఖరి గెలుపు

Kings XI Punjab beat Chennai Super Kings by 6 wickets - Sakshi

చెన్నైపై 6 వికెట్ల తేడాతో జయభేరి

భారీ షాట్లతో విరుచుకుపడిన రాహుల్‌

డు ప్లెసిస్‌ సెంచరీ మిస్‌   

మొహాలి: ప్లే ఆఫ్‌ అవకాశాలు కోల్పోయిన తర్వాత  పంజాబ్‌ ఆట గెలుపుతో ముగిసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (55 బంతుల్లో 96; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకానికి 4 పరుగులతో దూరమయ్యాడు. స్యామ్‌ కరన్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. మెరుపులు మెరిపించిన లోకేశ్‌ రాహుల్‌ (36 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. హర్భజన్‌ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి.

డు ప్లెసిస్‌ జోరు
చెన్నై ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లలో వాట్సన్‌ (7) విఫలమయ్యాడు. కానీ డు ప్లెసిస్‌ వేగం, నిలకడ కలగలిపిన ఇన్నింగ్స్‌ ఆడాడు. వీలు చిక్కితే బౌండరీ లేదంటే ఒకట్రెండు పరుగులతో జట్టును నడిపించాడు. ఇతనికి జతయిన రైనా దూకుడు కనబరచడంతో చెన్నై స్కోరు పరుగెత్తింది. 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 79 పరుగులు చేసింది. వీళ్లిద్దరు ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆడారు. ఈ క్రమంలో డు ప్లెసిస్‌ 37 బంతుల్లో, రైనా 34 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 15వ ఓవర్‌ నుంచి ఈ జోడీ వేగం పెంచింది.

మురుగన్‌ అశ్విన్‌ 15వ ఓవర్లో రైనా ఒక ఫోర్‌ కొడితే డుప్లెసిస్‌ 4, 6 బాదాడు. టై 16వ ఓవర్లో డుప్లెసిస్‌ 2 ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. జట్టు స్కోరు 150 పరుగుల వద్ద కరన్‌ ఈ భాగస్వామ్యానికి తెరదించాడు.  రైనా (38 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఔట్‌ చేయడంతో 120 పరుగులు రెండో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్లో సిక్స్‌తో సెంచరీకి చేరువైన డు ప్లెసిస్‌ను కరనే ఔట్‌ చేశాడు. ధోని (10 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు.

పంజాబ్‌ 57/0...రాహుల్‌ 52
పంజాబ్‌ లక్ష్యఛేదనను రాహుల్‌ సిక్స్‌తో, క్రిస్‌ గేల్‌ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫోర్‌తో ఆరంభించారు. ముఖ్యంగా రాహుల్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రెండో ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టాడు. అతడు తొలి 8 బంతుల్లో చేసిన 18 పరుగులు సిక్స్‌ల రూపంలోనే వచ్చాయి. హర్భజన్‌ సింగ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో ఐదు సార్లు బంతి బౌండరీ లైనును దాటింది. రాహుల్‌ వరుసగా 4, 4, 4, 6, 0, 6లతో ఏకంగా 24 పరుగులు సాధించాడు. అంతే 3.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరగా... 19 బంతుల్లోనే రాహుల్‌ అర్ధశతకం పూర్తయింది. ఇమ్రాన్‌ తాహిర్‌ ఏడో ఓవర్‌ను గేల్‌ ఆడుకున్నాడు. 4, 6, 6తో 17 పరుగులు చేశాడు.

అడ్డుఅదుపులేని బౌండరీలతో జట్టు స్కోరు 9 ఓవర్లలోనే వందకు చేరింది. ఇక మిగిలింది 11 ఓవర్లలో 71 పరుగులే. అయితే 11వ ఓవర్‌ వేసిన హర్భజన్‌ వీళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 108 స్కోరు వద్ద 2 వికెట్లను కోల్పోయింది. భజ్జీ మరుసటి ఓవర్లో మయాంక్‌ అగర్వాల్‌ (7) ఆటను ముగించాడు. కానీ నికోలస్‌ పూరన్‌ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపుల బాధ్యతను తీసుకోవడంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. 164 పరుగుల వద్ద అతను ఔటైనా... మిగతా లాంఛనాన్ని మన్‌దీప్‌ సింగ్‌ (11 నాటౌట్‌), స్యామ్‌ కరన్‌ (6 నాటౌట్‌) పూర్తి చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top