సఫారీ గడ్డపై నారీభేరి

 IND beat SA by 54 runs, win series 3-1 - Sakshi

టి20 సిరీసూ భారత్‌ వశం ఆఖరి పోరులో  54 పరుగుల తేడాతో గెలుపు

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత నారీమణుల జట్టు చరిత్రకెక్కే సిరీస్‌లను కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదట వన్డే సిరీస్‌ను, తాజాగా టి20 సిరీస్‌నూ  కైవసం చేసుకొని ఇక్కడ రెండు ఫార్మాట్లలలో నెగ్గిన తొలి జట్టుగా ఘనత  వహించింది. శనివారం జరిగిన ఆఖరి టి20లో బ్యాటింగ్‌లో మిథాలీ రాజ్, ముంబై టీనేజ్‌ సంచలనం జెమీమా రోడ్రిగ్స్‌... బౌలింగ్‌లో శిఖా పాండే, రుమేలీ ధర్, రాజేశ్వరి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు.

కేప్‌టౌన్‌: భారత మహిళల జట్టు సఫారీ పర్యటనను దిగ్విజయంగా ముగించింది. ఆఖరి టి20లో హర్మన్‌ప్రీత్‌ బృందం 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3–1తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.  మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకున్న భారత్‌ వరుస సిరీస్‌లతో దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనుభవజ్ఞురాలైన మిథాలీ రాజ్‌ (50 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు టీనేజ్‌ సంచలనం జెమీమా రోడ్రిగ్స్‌ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (17 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడింది. సఫారీ బౌలర్లలో మరిజనే కాప్, అయబొంగ కాకా, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 18 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు శిఖా పాండే (3/16), రుమేలీ ధర్‌ (3/26), రాజేశ్వరి గైక్వాడ్‌ (3/26) సమష్టిగా విజృంభించడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. మరిజనే కాప్‌ చేసిన 27 పరుగులే ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ టాప్‌స్కోర్‌ కాగా... ట్రియాన్‌ 25 పరుగులు చేసింది. సిక్సర్లతో చెలరేగుతున్న కాప్‌ ఇన్నింగ్స్‌కు జెమీమా అద్భుతమైన క్యాచ్‌తో ముగింపు పలికింది. రుమేలీ బౌలింగ్‌లో మరిజనె కాప్‌ భారీ షాట్‌ బాదగా... బౌండరీ లైన్‌ దగ్గర జెమీమా కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకోవడం మ్యాచ్‌లో హైలైట్‌. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్, సిరీస్‌ రెండూ మిథాలీకే లభించాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top