ధోని ఆటతీరుపై గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Gambhir's interesting comments on Dhoni's performance | Sakshi
Sakshi News home page

ధోని ఆటతీరుపై గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Apr 26 2017 12:47 AM | Updated on Sep 5 2017 9:40 AM

ధోని ఆటతీరుపై గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ధోని ఆటతీరుపై గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మ్యాచ్‌లను ముగించడంలో ధోని ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే.

గెలిపించినవాడే ఫినిషర్‌!

కోల్‌కతా: మ్యాచ్‌లను ముగించడంలో ధోని ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో ధోనితో విభేదించే గంభీర్‌ ఈసారి కూడా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ‘నా దృష్టిలో ఫినిషర్‌ అని స్టార్టర్‌ అని ఎవరూ ఉండరు. ఆఖరి పరుగు తీసినవాడే ఫినిషర్‌. అతను ఓపెనర్‌ కావచ్చు లేదా 11వ నంబర్‌ ఆటగాడు కావచ్చు. ఆటగాడు ఎలా ఆడాడన్నదే ముఖ్యం. తన జట్టు కోసం మ్యాచ్‌లు గెలిపించివాడే ఫినిషర్‌’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. కొన్నాళ్ల క్రితమే క్రికెటర్లపై సినిమాలు తీయడానికి తాను వ్యతిరేకం అంటూ ధోని సినిమా విడుదల సమయంలో కూడా గంభీర్‌ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం చర్చకు దారితీసింది. బుధవారం పుణే, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ జరగనుంది.

బాగా ఆడకపోతే మీ పని ఖతం...
బెంగళూరును చిత్తుగా ఓడించిన మ్యాచ్‌లో కోల్‌కతా ముందుగా బ్యాటింగ్‌ చేసి 131 పరుగులే చేయగలిగింది. టి20 ప్రమాణాల ప్రకారం చూస్తే ఐపీఎల్‌లో ఈ స్కోరును నిలబెట్టుకోవడం చాలా కష్టం. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఏ జట్టు కెప్టెన్‌ అయినా ‘మనం బాగా ఆడదాం, వంద శాతం ప్రయత్నిద్దాం, ఓడినా ప్రయత్నలోపం ఉండకూడదు, పోరాడితే గెలవవచ్చు’... ఇలాంటి మాటలతో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తాడు. కానీ గౌతమ్‌ గంభీర్‌ ఇలాంటి మొహమాటాలు ఏమీ పెట్టుకోలేదు. మీ ఆటలో ఏ మాత్రం తీవ్రత తగ్గినా జట్టులోంచి తీసేస్తానని ఆటగాళ్లతో నేరుగా చెప్పేశాడు.

‘మా బ్యాటింగ్‌ను చూశాక తీవ్ర నిరాశ కలిగింది. అనంతరం ప్రత్యర్థి బ్యాటింగ్‌ సమయంలో జట్టు సభ్యుల నుం చి నేను దూకుడు ఆశించాను. వారు గట్టిగా పోరాడాలని, గెలిపించాలని కోరుకున్నాను. ఎవరైనా కాస్త ఉదాసీనత కనబర్చినా కోల్‌కతా తరఫున వారికి ఇదే ఆఖరి మ్యాచ్‌ అని చెప్పాను. నేను కెప్టెన్‌గా ఉన్నంత వరకైతే వారు మళ్లీ ఆడలేరని హెచ్చరించాను’ అని గంభీర్‌ ఆదివారం మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. గెలుపు అందుకునే ప్రయత్నంలో మైదానంలో ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు తాను వెనుకాడనని... ఈ క్రమంలో ఫెయిర్‌ప్లే అవార్డు పాయింట్లు కోల్పోయినా తాను లెక్క చేయనని అతను వ్యాఖ్యానించాడు. తన జట్టు పాయింట్ల పట్టికలో ముందంజలో నిలవడమే తనకు ముఖ్యమని గంభీర్‌ తేల్చి చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement