జూమ్... ధూమ్... | formula 1 show | Sakshi
Sakshi News home page

జూమ్... ధూమ్...

Apr 6 2015 1:28 AM | Updated on Sep 2 2017 11:54 PM

ఫార్ములా వన్ (ఎఫ్1) రేస్‌లపై ఆసక్తి చూపించే నగర అభిమానులకు తొలిసారి ఆ రేసింగ్ కారు విన్యాసాలను చూసే అరుదైన అవకాశం దక్కింది.

అభిమానులను అలరించిన ఎఫ్1 షో రన్
 
సాక్షి, హైదరాబాద్ : ఫార్ములా వన్ (ఎఫ్1) రేస్‌లపై ఆసక్తి చూపించే నగర అభిమానులకు తొలిసారి ఆ రేసింగ్ కారు విన్యాసాలను చూసే అరుదైన అవకాశం దక్కింది. ఆదివారం హుస్సేన్‌సాగర్ తీరంలో ట్యాంక్‌బండ్‌పై రెడ్‌బుల్ టీమ్ ఎఫ్1 కారు ‘షో రన్’ జరిగింది. 13 సార్లు ఎఫ్1 రేస్‌లు గెలుచున్న డ్రైవర్ డేవిడ్ కూల్ట్‌హర్డ్ ఇక్కడ తన విన్యాసాలు ప్రదర్శించాడు. ఈ రోడ్‌పై రేసింగ్ కారు గంటకు దాదాపు 282 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం విశేషం. దద్దరిల్లే కారు ఇంజిన్ సౌండ్, ఆ వేగం భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.

నేరుగా లైన్‌లో అతి వేగంగా డ్రైవ్ చేయడంతో పాటు ఒకే చోట కారును గుండ్రంగా తిప్పుతూ కూల్ట్‌హర్డ్ చేసిన విన్యాసాలు అలరించాయి. దీంతో పాటు లిథునేనియాకు చెందిన ప్రముఖ స్టంట్ రైడర్ అరాస్ గిబీజా తన బైక్‌తో ప్రదర్శించిన థ్రిల్స్ మజాను అందించాయి. ‘భారత్‌లో రెండోసారి ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల థ్రిల్ కోసం ఇలా ఎఫ్1 కారును డ్రైవ్ చేయడాన్ని నేనూ బాగా ఆస్వాదించాను. ఇలాంటి చారిత్రక ప్రదేశంలో అభిమానుల ప్రోత్సాహం, ఉత్సాహం నన్ను ఆశ్చర్యపరిచాయి.

హైదరాబాద్‌లో నా రేస్‌ను, ఫ్యాన్స్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని ఈ సందర్భంగా కూల్ట్‌హర్డ్ వ్యాఖ్యానించాడు. అంతకు ముందు సినీ హీరో అక్కినేని నాగార్జున చకర్డ్ ఫ్లాగ్ ఊపి ఈ రేస్‌ను ప్రారంభించగా...రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు, హీరో నాగచైతన్య, భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కూల్ట్‌హర్డ్ ‘సారీ’

షో రన్ ముగిసిన అనంతరం మరో కారులో డ్రైవర్ కూల్ట్‌హర్డ్ భారత జాతీయజెండా పట్టుకొని ప్రేక్షకులకు చేరువగా వచ్చే ప్రయత్నంలో చిన్న అపశ్రుతి దొర్లింది. అనుకోకుండా అతని చేతిలోంచి పతాకం జారి కాళ్ల వద్ద పడిపోయింది. దీనిపై అనంతరం వివరణ ఇస్తూ డేవిడ్ ‘సారీ’ చెప్పాడు. తమ దేశంలో జెండా గురించి ఈ తరహా సంప్రదాయం, నిబంధనలు లేకపోవడం వల్ల తాను అప్రమత్తంగా లేనని... అంతే తప్ప తాను అవమానించలేదని అన్నాడు. భారత్ అంటే తనకు గౌరవం ఉందని, దీనిని అనుకోకుండా జరిగిన పొరపాటుగా భావించి క్షమించాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement