breaking news
raceing car
-
ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున శనివారం ప్రారంభం కాగా.. ఆ ఎఫెక్ట్ మాత్రం నగరంలోని పలు రోడ్లపైన పడింది. శనివారం ట్రయల్ రన్, క్వాలిఫైయింగ్ రేస్‌ల తరువాత మెయిన్ రేసింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు సాగింది. రేసింగ్ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. ప్రసాద్ ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ గుండా వేసిన 2.8 కిలోమీటర్ల ప్రత్యేక సర్క్యూట్లో ఈ రేస్ సాగింది. కాగా, మూడు రోజులుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ రోడ్డులో స్వల్పంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, శనివారం నుంచి నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన రోడ్లన్నీ మూసివేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు రోడ్డును మూసివేశారు. మింట్ కంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లే రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను ఫ్లైఓవర్ పై నుంచి పంపిస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్‌పై ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా ముందుకు సాగింది. ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు.. బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. రసూల్ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మి నార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. నగరం నడిబొడ్డున ట్రాఫిక్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మల్లించిన కారణంగా ఆ ఎఫెక్ట్ అన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యకు దారితీసింది. మెహిదీపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే పైన కూడా వాహనాలు నిలిచిపోయేంత ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ మీదుగా లక్డికాపూల్ వరకు, లక్డికాపూల్ నుంచి అమీర్‌పేట వెళ్లే రోడ్డు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, అసెంబ్లీ నుంచి ఆబిడ్స్ వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా సాగింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన పరిస్థితి. శనివారం వర్కింగ్ డే కావడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని నగర పోలీస్ వర్గాలు చెప్పాయి. ఆదివారం ట్రాఫిక్ సమస్య అంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. సోమవారం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ పేర్కొంది. -
సాగర తీరంలో రయ్ రయ్.. పరుగులు తీసిన రేసింగ్ కార్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం నెక్లెస్ రోడ్డులోని స్ట్రీట్ సర్క్యూట్లో అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీశాయి. 60 నుంచి 80 సెకన్ల వ్యవధిలో ఒక ల్యాప్ చొప్పున పూర్తి చేశాయి. సాయంత్రం 4.18 గంటలకు మంత్రి కేటీఆర్ ట్రాక్‌ను సందర్శించి జెండా ఊపి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. దాంతో రేసింగ్ కార్లు ముందుకు దూకాయి. వాయువేగంతో దూసుకెళ్లాయి. గంట పాటు పోటీలు జరిగాయి. 2.7 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ పోటీల కోసం 2.3 కిలోమీటర్ల ట్రాక్నే వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌లో 17 మలుపుల నుంచి 200 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీశాయి. ఈ పోటీలను వీక్షించేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. పిల్లలు, పెద్దలతో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడిగా కనిపించింది. మరోవైపు పోటీల నిర్వహణ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తకుండా వలంటీర్లు, భద్రతా బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ పోటీలను తిలకించేందుకు కేటీఆర్ తనయుడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి వచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఆరు బృందాలు.. 12 కార్లు.. పోటీల్లో ఆరు బృందాలు పాల్గొన్నాయి. 12 రేసింగ్ కార్లను వినియోగించారు. హైదరాబాద్ బర్డ్స్ టీమ్‌లో నగరానికి చెందిన బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు అనిందిత్‌రెడ్డి, అఖిల్ రవీంద్ర, స్వీడన్ రేసర్ నీల్జానీ, ఫ్రెంచ్ రేసర్ లోలా లోవిన్సాస్లు ఉన్నారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం తొలిరోజు క్వాలిఫయింగ్తో పాటు ఒక ప్రధాన రేస్ జరగాల్సి ఉన్నా.. కొత్త ట్రాక్ కావడంతో రేసర్లు ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. ఆదివారం అన్ని రేసులూ జరగనున్నాయి. కుంగిన గ్యాలరీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ కొద్దిగా కిందకు కుంగింది. మంత్రి కేటీఆర్ రావడంతో ఆయనతో పాటు చాలా మంది పైకి వచ్చారు. దీంతో గ్యాలరీ సామర్థ్యం కంటే ఎక్కువ మంది చేరడంతో ఒక వైపు బరువు పెరిగి గ్యాలరీ కుంగింది. అప్రమత్తమైన పోలీసులు కొంతమందిని కిందకు దింపారు. విరిగిపడిన చెట్టు కొమ్మ మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గ్యాలరీలు వెలవెల వేలాది మంది ప్రేక్షకులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలను ఏర్పాటు చేసినప్పటికీ జనసందోహం తక్కువగానే కనిపించింది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీగానే కనిపించాయి. చాలా మంది నెక్లెస్‌రోడ్డు, మింట్‌కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో ట్రాక్ బయట నించొని పోటీలను వీక్షించారు. హైదరాబాద్ మంచి వేదిక ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు తదితర చోట్ల కార్ రేసింగ్ జరిగింది. మన హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ రేసింగ్ శిక్షణకు, పోటీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో పాటు మలేసియా, జపాన్, థాయ్‌లాండ్, చైనా తదితర దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. పదేళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. హైదరాబాద్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. స్ట్రీట్ సర్క్యూట్ కూడా చాలా బాగుంది. అంతా తిరిగి చూశాం. ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. – అనిందిత్‌రెడ్డి, హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్‌కు ఉత్తమ భవిష్యత్ మోటార్ స్పోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న క్రీడ. ఈ క్రీడలో పాల్గొనే రేసర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది. మన ఇండియాలో కూడా రేసింగ్‌లో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయి. బెంగళూరు, కొచ్చి వంటి నగరాల్లో ఈ శిక్షణ ఉంది. హైదరాబాద్ యూత్‌కు ఈ రంగంలో గొప్ప అవకాశాలున్నాయి. – అఖిల్ రవీంద్ర, బెంగళూరు ఇండియాలో ఇదే తొలిసారి పారిస్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ఇండియాలో పాల్గొనడం ఇదే మొదటిసారి. చాలా ఉత్సాహంగా ఉంది. 2016 నుంచి రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్నాను. ఈ పోటీలు నాకు చాలా ఇష్టం. – లోలా లోవిన్సాస్, ఫ్రాన్స్ ఇంగ్లిష్ చానళ్లలో మాత్రమే చూసేవాళ్లం కార్ రేసింగ్ అంటే ఇన్నాళ్లు టీవీలో.. అదికూడా ఇంగ్లిష్ న్యూస్ చానళ్లల్లో మాత్రమే చూసేవాళ్లం. అలాంటిది ఈ రేసింగ్ ఈవెంట్‌ను సిటీలో నిర్వహించడం మంచి అనుభూతినిచ్చింది. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లో సిటీ ఎంత ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఫార్ములా వన్ వంటి గేమ్స్‌కు నగరం ఆతిథ్యమివ్వడంతో సిటీ గొప్పదనం మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇకపై నగరవాసులు కూడా ఇలాంటి గేమ్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. – సంతోష్, మోడలింగ్ ఔత్సాహికుడు నగరానికి నయా కళ ఇలాంటి కార్ రేసింగ్ ఒక్కసారైనా చూస్తానా అని అనుకునేదానిని. సిటీలో స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి వేచి చూశాను. ఇలాంటి ఇండియన్ రేసింగ్ ఈవెంట్స్ మరెన్నో నగరంలో జరగాలని కోరుకుంటున్నాను. మన రోడ్లపై రేసింగ్ కార్లు దూసుకుపోతుంటే ఏదో కొత్త కళ వచ్చింది. దేశ్యవాప్తంగా పాల్గొన్న రేసర్లను దగ్గరగా చూడటం మంచి అనుభూతి. – ఐశ్వర్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం -
జూమ్... ధూమ్...
అభిమానులను అలరించిన ఎఫ్1 షో రన్ సాక్షి, హైదరాబాద్ : ఫార్ములా వన్ (ఎఫ్1) రేస్‌లపై ఆసక్తి చూపించే నగర అభిమానులకు తొలిసారి ఆ రేసింగ్ కారు విన్యాసాలను చూసే అరుదైన అవకాశం దక్కింది. ఆదివారం హుస్సేన్‌సాగర్ తీరంలో ట్యాంక్‌బండ్‌పై రెడ్‌బుల్ టీమ్ ఎఫ్1 కారు ‘షో రన్’ జరిగింది. 13 సార్లు ఎఫ్1 రేస్‌లు గెలుచున్న డ్రైవర్ డేవిడ్ కూల్ట్‌హర్డ్ ఇక్కడ తన విన్యాసాలు ప్రదర్శించాడు. ఈ రోడ్‌పై రేసింగ్ కారు గంటకు దాదాపు 282 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం విశేషం. దద్దరిల్లే కారు ఇంజిన్ సౌండ్, ఆ వేగం భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. నేరుగా లైన్లో అతి వేగంగా డ్రైవ్ చేయడంతో పాటు ఒకే చోట కారును గుండ్రంగా తిప్పుతూ కూల్ట్‌హర్డ్ చేసిన విన్యాసాలు అలరించాయి. దీంతో పాటు లిథునేనియాకు చెందిన ప్రముఖ స్టంట్ రైడర్ అరాస్ గిబీజా తన బైక్‌తో ప్రదర్శించిన థ్రిల్స్ మజాను అందించాయి. ‘భారత్‌లో రెండోసారి ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల థ్రిల్ కోసం ఇలా ఎఫ్1 కారును డ్రైవ్ చేయడాన్ని నేనూ బాగా ఆస్వాదించాను. ఇలాంటి చారిత్రక ప్రదేశంలో అభిమానుల ప్రోత్సాహం, ఉత్సాహం నన్ను ఆశ్చర్యపరిచాయి. హైదరాబాద్‌లో నా రేస్‌ను, ఫ్యాన్స్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని ఈ సందర్భంగా కూల్ట్‌హర్డ్ వ్యాఖ్యానించాడు. అంతకు ముందు సినీ హీరో అక్కినేని నాగార్జున చకర్డ్ ఫ్లాగ్ ఊపి ఈ రేస్‌ను ప్రారంభించగా...రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు, హీరో నాగచైతన్య, భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూల్ట్‌హర్డ్ ‘సారీ’ షో రన్ ముగిసిన అనంతరం మరో కారులో డ్రైవర్ కూల్ట్‌హర్డ్ భారత జాతీయజెండా పట్టుకొని ప్రేక్షకులకు చేరువగా వచ్చే ప్రయత్నంలో చిన్న అపశ్రుతి దొర్లింది. అనుకోకుండా అతని చేతిలోంచి పతాకం జారి కాళ్ల వద్ద పడిపోయింది. దీనిపై అనంతరం వివరణ ఇస్తూ డేవిడ్ ‘సారీ’ చెప్పాడు. తమ దేశంలో జెండా గురించి ఈ తరహా సంప్రదాయం, నిబంధనలు లేకపోవడం వల్ల తాను అప్రమత్తంగా లేనని... అంతే తప్ప తాను అవమానించలేదని అన్నాడు. భారత్ అంటే తనకు గౌరవం ఉందని, దీనిని అనుకోకుండా జరిగిన పొరపాటుగా భావించి క్షమించాలని కోరాడు.