బెన్‌ స్టోక్స్‌.. నువ్వు మారవా!

ENG Vs SA: Ben Stokes Abuses Fan After Dismissal In 4th Test - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌:  ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎన్నిసార్లు హీరోగా నిలిచాడనే విషయాన్ని పక్కన పెడితే, ‘విలన్‌’ పాత్రలో ఇంకా మెరిపిస్తూనే ఉన్నాడు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం జరిగిన ‘బ్రిస్టల్‌ పబ్‌ ఉదంతం’ సగటు క్రీడాభిమానికి గుర్తుండే ఉంటుంది. విండీస్‌తో సిరీస్‌లో భాగంగా ఓ రోజు రాత్రి రాత్రి 2 గంటల సమయంలో పబ్‌ బయట ఓ వ్యక్తితో స్టోక్స్‌ గొడవకు దిగాడు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి దాదాపు ఎదుటి వ్యక్తిని చంపే స్థాయిలో స్టోక్స్‌ దాడి చేశాడంటూ అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. దాంతో చాలాకాలం ఇంగ్లండ్‌ జట్టుకు దూరమైన స్టోక్స్‌ ఎలాగోలా ఆ కేసు నుంచి బయటపడ్డాడు. 

ఆపై ఇంగ్లండ్‌ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్టోక్స్‌.. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్‌  గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతే స్థాయిలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ‘వీధిలో రౌడీలా గొడవకు దిగిన వ్యక్తిగా నేను గుర్తుండిపోదల్చుకోలేదు. మైదానంలో ఏదైనా సాధించిన వాడిగా ఉండాలనుకుంటున్నా. ప్రపంచ కప్‌ గెలిస్తే నా బయోడేటాలో అదే ముందుంటుంది’ అని మెగా టోర్నీకి ముందు చెప్పిన స్టోక్స్‌ చివరకు దానిని నిజం చేసి చూపించాడు. ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ అందించడంలో కీలక పాత్ర పోషించి ఒకరకంగా అతను పాపపరిహారం చేసుకున్నాడు. టోర్నీలో ఐదు అర్ధ సెంచరీలు చేసిన స్టోక్స్‌... ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ అపూర్వం. క్లిష్టపరిస్థితుల్లో అజేయంగా 84 పరుగులు చేసిన స్టోక్స్‌ చరిత్రలో నిలిచిపోయాడు. దాంతో ఇంగ్లండ్‌ జట్టులో హీరోగా మారిపోయాడు. అయితే స్టోక్స్ ఎంత మారదామనుకున్నా లోపల ఉన్న మరో మనిషి అలానే ఉన్నట్లు ఉన్నాడు. అందుకే సహచర ఆటగాళ్లపైనే కాదు.. మ్యాచ్‌ చూడటానికి వచ్చిన అభిమానులపై కూడా నోరు పారేసుకుంటున్నాడు. 

బ్రాడ్‌తో వాగ్వాదం..
ఇటీవల దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు సందర్భంగా సహచర ఆటగాడు స్టువర్ట్‌ బ్రాడ్‌నే తిట్టిపోశాడు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో స్టోక్స్‌ తన నోటికి పనిచెప్పాడు. ఆ మ్యాచ్‌ విరామంలో ఇంగ్లండ్‌ జట్టులో స్ఫూర్తిని నింపే పనిలో బ్రాడ్‌ ఉండగా, అనవసరంగా కలగజేసుకున్న స్టోక్స్‌ కించపరిచేలా మాట్లాడాడు. ఈ విషయాన్ని స్వయంగా బ్రాడ్‌నే చెప్పాడు. ఆ మ్యాచ్‌లో మేము  చాలా విరామం తర్వాత వికెట్‌ సాధించాం. దాంతో  బ్రేక్‌ వచ్చింది. ఈ సమయంలో మా బాయ్స్‌లో ప్రేరణ నింపే పనిలో ఉన్నా. మన పూర్తిస్థాయి ఆటకు సిద్ధం కావాలి. బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌ బౌలింగ్‌ వేయాలి. ఫీల్డర్లు సింగిల్‌ తీసే అవకాశం  కూడా ఇవ్వకూడదు’ అని తమ ఆటగాళ్లలో స్పూర్తిని నింపడానికి యత్నించిన విషయాన్ని చెప్పాడు. 

అప్పుడు స్టోక్స్‌ తన దగ్గరకు వచ్చి తాను చెప్పిన దానితో అంగీకరించలేదన్నాడు. అలా చెప్పడాన్ని గొప్ప విషయం కాదంటూ కించపరిచేలా మాట్లాడాడని బ్రాడ్‌ చెప్పుకొచ్చాడు. ముందు ఆ పని నువ్వు చేసి చూపించి అంటూ తనతో వాగ్వాదానికి దిగాడన్నాడు. తాము అన్ని విషయాల్లో బాగానే ఉన్నామని, నువ్వు శ్రమించూ అంటూ కౌంటర్‌ వాదనకు దిగాడన్నాడు.

బయటకొచ్చి చెప్పు నీ సంగతి చూస్తా
దక్షిణాఫ్రికాతో నాల్గో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ 2 పరుగులకే ఔటై పెవిలియన్‌ చేరుతున్న క్రమంలో ఓ అభిమానిపై నోరు పారేసుకున్నాడు. సదరు అభిమాని ఏమన్నాడో తెలియదు కానీ,  స్టోక్స్‌ మాత్రం అసభ్యపదజాలంతో దూషించాడు. గ్రౌండ్‌ బయటకొచ్చి మాట్లాడు.. నీ సంగతి చూస్తా అంటూనే బూతుపురాణం అందుకున్నాడు. దీనిపై మ్యాచ్‌ తర్వాత స్టోక్స్‌ క్షమాపణలు చెప్పాడు. తన భాష సరిగా లేదనే విషయాన్ని ఒప్పుకున్నాడు.  ఇదిలా ఉంచితే, అది అవసరమా కాదా.. అనే విషయాన్ని ఆలోచించకుండా ముందు నోరు పారేసుకోవడం , ఆపై సారీలు చెప్పడం స్టోక్స్‌కు పరిపాటిగా మారిపోయింది. స్టోక్స్‌లో ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ తన ప్రవర్తనతో ఇంగ్లండ్‌ అభిమానులకు, ఆ దేశ మాజీ క్రికెటర్లకు విసుగు తెప్పిస్తున్నాడు. గతంలో స్టోక్స్‌ను ఉద్దేశిస్తూ అతనిలో హీరో కాదు.. విలన్‌ ఉన్నాడు అని ఆ దేశ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ చేసిన వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేవిధంగానే ‘ 2019 వరల్డ్‌కప్‌ హీరో’ ప్రవర్తించడం అతని కెరీర్‌నే ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top