గ్యారీ కిర్‌స్టన్‌కు మళ్లీ నిరాశే

ECB Disappointed Kirsten Hopes - Sakshi

లండన్‌:  ఇటీవల భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ మాజీ కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం కిర్‌స్టన్‌ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది.  తాజాగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌ తుది జాబితాలో కిర్‌స్టన్‌ పేరున్నప్పటికీ సిల్వర్‌వుడ్‌ను నియమించడానికి ఈసీబీ మొగ్గుచూపింది. ఇంటర్యూలో కిర్‌స్టన్‌ కంటే సిల్వర్‌వుడ్‌ చెప్పిన సమాధానాలకే అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఈసీబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

భారత్‌, దక్షిణాఫ్రికా జట్లకు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న కిర్‌స్టన్‌.. ఈసీబీ రేసులో ముందందజలో నిలిచినా చివరకు మాత్రం ప్రతికూల ఫలితమే వచ్చింది. స్వదేశీ క్రికెటర్‌ కావడమే సిల్వర్‌వుడ్‌కు నియమాకానికి ప్రధాన కారణం. ఇప్పటివరకూ ఇంగ్లండ్‌కు కోచ్‌గా పని చేసిన ట్రావెర్‌ బెయిలీస్‌ పదవీ కాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఈసీబీ.. కోచ్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.  ఈ క్రమంలోనే కిర్‌స్టన్‌ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. పలువురు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు కిర్‌స్టన్‌ నియమానికే ఓటేసినా,  ఆ దేశ  క్రికెట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సమక్షంలోనే ఈసీబీ సెలక్షన్‌ ప్యానల్‌ మాత్రం సిల్వర్‌వుడ్‌ పేరును ఖరారు చేసింది. 2017-18 సీజన్‌లో భాగంగా యాషెస్‌ సిరీస్‌కు 44 ఏళ్ల సిల్వర్‌వుడ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా సేవలందించడం కూడా అతని నియమానికి  దోహదం చేసింది. ఇంగ్లండ్‌ ప్రధాన కోచ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో కిర్‌స్టన్‌తో పాటు అలెక్‌ స్టువార్ట్‌, గ్రాహమ్‌ ఫోర్డ్‌లు ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top