ధోని లేకుండానే... ధనాధన్‌కు

Dhoni not play the T20 match - Sakshi

ఈడెన్‌ గార్డెన్స్‌లో నేడు వెస్టిండీస్‌తో తొలి టి20 

కుర్రాళ్లతో సిద్ధమైన పర్యాటక జట

 రోహిత్‌ సారథ్యంలో బరిలోకి టీమిండియా

మహేంద్ర సింగ్‌ ధోని... దాదాపు 12 ఏళ్ల క్రితం టీమిండియా ఆడిన తొలి టి20 నుంచి జట్టు సభ్యుడు. దేశానికి ప్రపంచ కప్‌ అందించిన ఘనుడు. మధ్యలో అప్రధానమైన ఒకటీ, అరా సిరీస్‌ల నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నా, ఇన్నేళ్లలో అతడు లేకుండా తొలిసారిగా భారత్‌ పొట్టి ఫార్మాట్‌ బరిలో దిగుతోంది. ఇదే విశేషాంశంగా ఆదివారం వెస్టిండీస్‌తో మొదటి టి20లో తలపడనుంది. అటు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్రాంతి నేపథ్యంలో స్వదేశంలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ జట్టును నడిపించనున్నాడు. గడ్డ ఏదైనా,ఏ క్షణంలోనైనా విరుచుకుపడి అంచనాలను తలకిందులు చేయగల సమర్థులైన కరీబియన్లతో... క్షణాల్లో ఫలితంతారుమారయ్యే ఈ ఆధునిక క్రికెట్‌లో మరి ఆధిపత్యం ఎవరిదో...?  

కోల్‌కతా: టెస్టు సిరీస్‌ను ఏకపక్షంగా గెల్చుకుని, వన్డే సిరీస్‌ను ఒడిసిపట్టిన టీమిండియా... టి20 సిరీస్‌లోనూ వెస్టిండీస్‌ సంగతి తేల్చేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. మిగతా విషయాలు ఎలా ఉన్నా తమ ఆటతీరుకు సరితూగే పొట్టి ఫార్మాట్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పర్యాటక జట్టు అత్యంత కఠినమైనది. పైగా ఈసారి దాదాపు చాలామంది కొత్తవారితో ఆడనుంది. వారి సామర్థ్యంపై అంచనాకు వచ్చి, చెలరేగే లోపు అడ్డుకునేందుకు భారత్‌ వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. 

కృనాల్‌ అరంగేట్రం? 
ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ సహా ముగ్గురేసి పేసర్లు, స్పిన్నర్లతో టీమిండియా మరోసారి ముందు రోజే 12 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఇందులో ముంబై ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా పేరుంది. కుల్దీప్‌ రూపంలో ఇప్పటికే ఒక ఎడంచేతి వాటం స్పిన్నర్‌ ఉన్నందున తుది కూర్పులో అతడికి చోటు దక్కుతుందో? లేదో? చూడాలి. ఆల్‌రౌండర్‌ కోటాలో పరిగణిస్తే మాత్రం కృనాల్‌ అరంగేట్రం ఖాయం. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్, శిఖర్‌ ధావన్‌ తర్వాత కేఎల్‌ రాహుల్‌ వన్‌డౌన్‌లో వస్తాడు. మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌ 4, 5 స్థానాల్లో దిగుతారు. ధోని బాధ్యతలు రిషభ్‌ పంత్‌ తీసుకుంటాడు. పేస్‌ భారాన్ని భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌ పంచుకుంటారు. మరో కోణంలో చూస్తే... సొంతగడ్డపై బ్యాటింగ్‌ గురించి బెంగపడాల్సిన పని లేదు కాబట్టి, విండీస్‌ దూకుడైన ఆటకు అడ్డుకట్ట వేయాలని భావిస్తూ కృనాల్‌కు తోడుగా ఐదుగురు ప్రధాన బౌలర్లతో ఆడినా ఆడొ చ్చు. అప్పుడు పాండే, కార్తీక్‌లలో ఒకరిని పక్కనపెడతారు. అలాగైతే ఇది కొత్త ప్రయత్నమే అవుతుంది. 

విండీస్‌ ఏం చేస్తుందో? 
టి20ల్లో మెరుపు ఆటకు పెట్టింది పేరు కరీబియన్లు. కానీ, ఈ సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరమైనందున ఆ జట్టు కూర్పుపై స్పష్టత కరవైంది. కనీసం ఓపెనర్లు ఎవరనేదీ తెలియడం లేదు. తాజాగా ఆల్‌రౌండర్‌ రసెల్‌ గాయం కారణంగా టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాథమికంగా చూస్తే, డారెన్‌ బ్రావో, రవ్‌మన్‌ పావెల్‌  ఇన్నింగ్స్‌ను ఆరంభించవచ్చు. యువ హెట్‌మైర్‌ వన్‌డౌన్‌లో దిగుతాడు. దినేశ్‌ రామ్‌దిన్, కీరన్‌ పొలార్డ్‌ తర్వాత వస్తారు. కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సహా కారీ పియరీ, షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌ ఆల్‌ రౌండర్‌ నైపుణ్యం కలవారు. వన్డేల్లో తేలిపోయిన పేసర్లు ఒషేన్‌ థామస్, కీమో పాల్, స్పిన్నర్‌ అలెన్‌... ఈసారి టీమిండియాకు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.

పంత్‌కు ఇది చక్కటి అవకాశం 
ధోని వంటి గొప్ప ఆటగాడు లేకపోవడం మాకు లోటే. పరిమిత వనరులతో ప్రపంచ కప్‌నకు వెళ్లలేం. ప్రత్యామ్నాయాలను సరి చూసుకునే ప్రయత్నంలో ఇది రిషభ్‌ పంత్‌తో పాటు దినేశ్‌ కార్తీక్‌కు తమను తాము నిరూపించుకునే గొప్ప అవకాశం. కెప్టెన్సీ చేపట్టడం అన్ని విధాలా సహాయ పడుతోంది. టి20ల్లో విండీస్‌ బలమైన ప్రత్యర్థి. చాలా ప్రమాదకరం కూడా. 
–రోహిత్‌శర్మ, భారత కెప్టెన్‌  

భారతే ఫేవరెట్‌... కానీ... 
గెలుపు గణాంకాల్లో మేం మెరుగ్గా ఉన్నా, సొంతగడ్డపై భారతే ఫేవరెట్‌. ముఖ్యంగా ఐపీఎల్‌ వారికి ఎంతో ఉపయోగపడింది. అయినా, మేం అండర్‌ డాగ్స్‌ కాదు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సత్తా చాటిన ఉత్సాహవంతులైన కుర్రాళ్లతో బరిలో దిగుతున్నాం. సంచలనం సృష్టించి ట్రోఫీ నెగ్గాలనుకుంటున్నాం. ధోని, కోహ్లి లేకపోవడం మాకు లాభమే. కానీ, భారత జట్టులో ప్రతిభకు లోటు లేదు. 
–వెస్టిండీస్‌ కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, కృనాల్‌ పాండ్యా/కుల్దీప్‌ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్, యజువేంద్ర చహల్‌. 
వెస్టిండీస్‌: కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), ఫాబియన్‌ అలెన్, డారెన్‌ బ్రావో, హెట్‌మైర్, పొలార్డ్, రామ్‌దిన్, షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్, కారీ పియరీ, ఒషేన్‌ థామస్, మెకాయ్, రావ్‌మన్‌ పావెల్‌.

పిచ్, వాతావరణం 
ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమైనది. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు. గత వారం అకాల వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే గత మూడు రోజుల్లో ఎండ కాయడంతో మ్యాచ్‌కు మైదానం సిద్ధమైంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top