
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ఏమరపాటు శ్రీలంకకు కలిసొచ్చింది. ఫీల్డర్లు క్యాచ్ జారవిడచడంతో లంక బ్యాట్స్‌మన్‌కు లైఫ్ దోరకడమే కాకుండా అంపైర్ విధించిన పెనాల్టీతో ఐదు పరుగులు కలిసొచ్చాయి.
టీ బ్రేక్ అనంతరం మహ్మద్ షమీ వేసిన 7 ఓవర్ చివరి బంతి బ్యాట్స్‌మెన్ పెరీరా బ్యాట్ ఎడ్జ్‌ని తాకి ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. అయితే ఈ బంతిని సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ శిఖర్ ధావన్ జారవిడిచాడు. ఆ పక్కన ఫస్ట్ స్లిప్‌లో ఉన్న మరో ఫీల్డర్ పుజారా కూడా ఆ బంతిని అందుకోలేకపోయాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి వారి వెనుక ఉన్న కీపర్ హెల్మెట్‌కి తాకింది. కీపర్ సాహా బంతిని ఆపే ప్రయత్నం చేసినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే నిబంధనల ప్రకారం దీన్ని పరిగణలోకి తీసుకున్న అంపైర్ భారత్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. అనంతరం తనది ఎంత తప్పో గుర్తించిన ధావన్ పదేపదే ఆ క్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ కనిపించాడు.