
ఆకట్టుకున్న బాలచంద్ర
హైదరాబాద్ ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా మూడో రౌండ్‌లోనూ గ్రాండ్‌మాస్టర్ హోదా ఉన్న క్రీడాకారుడితో ఆడిన బాలచంద్ర గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. తొలి రౌండ్‌లో భారత జీఎం విష్ణు ప్రసన్నను ఓడించిన బాలచంద్ర... రెండో రౌండ్‌లో జీంఎ నీలోత్పల్ దాస్‌ను నిలువరించాడు.
బుధవారం మూడో రౌండ్‌లో జీఎం దీపన్ చక్రవర్తి (భారత్)తో జరిగిన గేమ్‌నూ బాలచంద్ర ‘డ్రా’గా ముగించాడు. నాలుగో రౌండ్‌లో శ్యామ్ నిఖిల్‌తో ఆడిన గేమ్‌నూ బాలచంద్ర ‘డ్రా’ చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు మూడున్నర పాయింట్లతో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. స్వయమ్స్ మిశ్రా (భారత్)తో మూడో రౌండ్ గేమ్‌ను నల్లపావులతో ఆడిన లలిత్ బాబు 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... స్వప్నిల్ ధోపాడేతో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో లలిత్ గెలుపొందాడు.