తొలి టీ20లో ఓడిన భారత్‌

Australia Beats India In First T20 - Sakshi

బ్రిస్బేన్‌:  ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్‌ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌ అర్ధ సెంచరీతో రాణించినా భారత్‌ పరాజయం చవిచూసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(4), ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(7) నిరాశపరిచారు. దినేశ్‌ కార్తీక్‌ (30),  రిషభ్‌ పంత్‌ (20) పరుగులు చేశారు.

టెన్షన్‌ రేపిన చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సిరాగా భారత్‌ 8 పరుగులు చేసి 2 వికెట్లు చేజార్చుకుంది. కీలక సమయంలో రిషబ్‌ పంత్‌, కృనాల్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ అవుట్‌ కావడంతో టీమిండియా ఓడిపోయింది. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా, స్టోయినిస్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆండ్రూ టై, బెహ్రెన్‌డార్ఫ్, స్టాన్‌లేక్‌ తలో వికెట్‌ తీశారు. లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి వికెట్లు పడగొట్టిన ఆడమ్‌ జంపా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  అందుకున్నాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. డీఎల్‌ఎస్‌ ప్రకారం టీమిండియాకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌ చెలరేగడంతో ఆసీస్‌ చాలెజింగ్‌ స్కోరు సాధించింది. మ్యాక్స్‌వెల్‌ సిక్సర్లతో చెలరేగాడు. 24 బంతుల్లో 4 సిక్సర్లతో 46 పరుగులు బాదాడు. స్టోయినిస్‌ 19 బంతుల్లో 3 ఫోర్లు సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. ఫించ్‌(27), క్రిస్‌ లిన్‌ (37) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, ఖలీల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆసీస్‌ కంటే ఎక్కువ స్కోరు చేసినా..
సాంకేతిక అంశాలను పక్కడపెడితే 17 ఓవర్లలో ఆస్ట్రేలియా కంటే భారత్‌ ఎక్కువ స్కోరు చేసింది. 17 ఆసీస్‌ 158 పరుగులు చేస్తే, టీమిండియా 169 పరుగులు సాధించింది. అయితే డీఎల్‌ఎస్‌ విధానంలో లెక్కగట్టి భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించడంతో గణాంకాలు మారాయి. ఫలితం మాట ఎలావున్నా రెండు జట్లు హోరాహోరీ తలపడటంతో క్రికెట్‌ ప్రేమికులు ఆటను ఆస్వాదించారు. టీమిండియా అభిమానులకు మాత్రం నిరాశ కలిగింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top