మొహమ్మద్‌ అలీ, శ్రీజలకు టైటిల్స్‌

Ali, Srija got Table Tennis Titles - Sakshi

తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో మొహమ్మద్‌ అలీ (ఎల్‌బీఎస్‌), ఆకుల శ్రీజ (ఎంఎల్‌ఆర్‌) విజేతలుగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో వ్యాసపురి బండ్లగూడ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన పురుషుల ఫైనల్లో మొహమ్మద్‌ అలీ 4–2తో అమన్‌ ఉర్‌ రహమాన్‌ (ఏవీఎస్‌సీ)పై గెలుపొందగా... మహిళల విభాగంలో శ్రీజ 4–3తో నిఖత్‌ బాను (ఆర్‌బీఐ)ను ఓడిచింది. యూత్‌ బాలికల విభాగంలోనూ శ్రీజ టైటిల్‌తో మెరిసింది. యూత్‌ బాలికల ఫైనల్లో శ్రీజ 4–0తో వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం)పై నెగ్గింది.

యూత్‌ బాలుర ఫైనల్లో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ (జీటీటీఏ) 4–3తో మొహమ్మద్‌ అలీ (ఎల్‌బీఎస్‌)ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. జూనియర్‌ బాలబాలికల విభాగాల్లో సస్య (ఏడబ్ల్యూఏ), బి. వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ) చాంపియన్‌లుగా నిలిచారు. బాలుర ఫైనల్లో వరుణ్‌ 4–3తో అమన్‌పై, బాలికల తుదిపోరులో సస్య 4–2తో భవితపై నెగ్గారు. సబ్‌ జూనియర్‌ కేటగిరీలో భవిత, కార్తీక్‌ టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. ఫైనల్లో కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ) 4–2తో కేశవన్‌ (ఎంఎల్‌ఆర్‌)పై, భవిత (జీఎస్‌ఎం) 4–0తో విధిజైన్‌ (జీఎస్‌ఎం)పై గెలిచారు. క్యాడెట్‌ విభాగంలో కావ్య, జతిన్‌దేవ్‌ విజేతలుగా నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌ బాబు పాల్గొ్గని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top