తుప్పు పట్టిన తుపాకీలతో లాభం ఏమిటి?

Akmals Consecutive Golden Ducks On T20I Return Irks Pakistan Fans - Sakshi

లాహోర్‌: చాలాకాలం తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో రీఎంట్రీ ఇచ్చిన ఉమర్‌ అక్మల్‌ ఇప్పుడు విమర్శకులకు బాగానే పనిచెప్పాడు. శ్రీలంకతో వరుస రెండు టీ20ల్లో గోల్డెన్‌ డక్‌(ఆడిన తొలి బంతికే) పెవిలియన్‌ చేరి ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో మూడో స్థానంలోబ్యాటింగ్‌కు దిగి గోల్డెన్‌ డకౌట్‌ కాగా రెండో మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేపట్టి మరోసారి మొదటి బంతికే ఔటయ్యాడు. కాగా, రెండో టీ20కి ముందు ఉమర్‌ అక్మల్‌తో పాటు మరో క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌లకు అండగా నిలిచాడు కోచ్‌ మిస్బావుల్‌ హక్‌. వారిని విమర్శలతో ప్రమాదంలోకి నెట్టవద్దని, స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని మద్దతు ప్రకటించాడు. 

అయితే రెండో టీ20లో ఉమర్‌ అక్మల్‌-షెహజాద్‌లు నిరాశపరచడంతో ట్వీటర్‌లో విమర్శల వర్షం కురుస్తోంది. ఇక్కడ పాకిస్తాన్‌ కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ను కూడా టార్గెట్‌ చేస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ కాలం చెల్లిపోయిన తుప్పు పట్టిన తుపాకీలతో లాభం ఏమిటి?’ అంటూ నిలదీస్తున్నారు. ‘ బ్యాక్‌ టు బ్యాక్‌ గోల్డెన్‌ డక్స్‌. రీఎంట్రీలో ఇది అత్యంత ప్రదర్శన’ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. ‘ పాపం మిస్బావుల్‌.. ఉమర్‌ అక్మల్‌ వరుస గోల్డెన్‌ డక్‌లతో మిస్బా ఇబ్బందిల్లో పడ్డాడు’ అని మరొక నెటిజన్‌ చమత్కరించారు. ‘ ఇక మీ ఇద్దర్నీ చూడాలని అనుకోవడం లేదు’ అంటూ మరొకరు పేర్కొన్నారు.

పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక జట్టు టి20 సిరీస్‌లో ఆకట్టుకుంది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే మూడు టి20ల సిరీస్‌ను శ్రీలంక 2–0తో కైవసం చేసుకుంది. లాహోర్‌లో సోమవారం జరిగిన రెండో టి20లో లంక 35 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రాజపక్స (77; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగాడు.  పాక్‌ 19 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది.  ఇమద్‌ వసీమ్‌ (47) రాణించాడు. రేపు ఆఖరి మ్యాచ్‌ ఇక్కడే జరుగుతుంది.  శ్రీలంక సీనియర్‌ జట్టులో పది మంద వరకూ పాక్‌ పర్యటనకు రావడానికి వెనుకాడితే.. ‘జూనియర్‌’ జట్టుతోనే పోరుకు సిద్ధమైంది. అయితే వన్డే సిరీస్‌ను కోల్పోయిన లంకేయులు.. టీ20 సిరీస్‌లో అంచనాలు మించి రాణించారు.  వరుస రెండు టీ20ల్లోనూ విజయం సాధించి తాము ఎంత ప్రమాదకరమో చాటిచెప్పారు. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్‌ను శ్రీలంక మట్టికరిపించడం గమనార్హం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top