ఇంద్రుడి గర్వభంగం

funday special story - Sakshi

వైశంపాయనుడు, భారతకథను జనమేజయునికి వినిపించాడు. అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి పాముకాటు వల్ల మరణించాడన్న సంగతి తెలుసుకున్న జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. యాగంలో చదివే మంత్రప్రభావం వల్ల సర్పాలన్నీ గుట్టలు గుట్టలుగా వచ్చి అగ్నికి ఆహుతి అయిపోతుంటాయి. లక్షలాది సర్పాలు, సర్పజాతులు నశించిపోసాగాయి.

 అయితే, పరీక్షిత్తును కాటు వేసిన తక్షకుడు ఆ మంత్ర సమ్మోహనానికి గురికాకుండా ఇంద్రుడు సాయం చేస్తాడు. రుత్విజులు తక్షకుడిని ఆకర్షిస్తూ ఆహుతులు సమర్పించసాగారు. తక్షకుడు భయంతో వెళ్లి ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకున్నాడు తనకేమీ జరగదన్న ధీమాతో ఉన్నాడు. ఇంద్రుడు కూడా కించిత్‌ గర్వించాడు. అయితే, రుత్విజులు దివ్యదృష్టితో అది తెలుసుకుని ‘స మహేంద్ర సింహాసనాయ తక్షకాయ స్వాహా’ అని పఠించడంతో ఒక్కసారిగా ఇంద్రసింహాసనం గాలిలోకి లేచింది. అప్పటివరకు గర్వంతో ఉన్న ఇంద్రుడు భయకంపితుడయ్యాడు. 

అప్పటికే సింహాసనం గిరికీలు కొడుతూ యాగశాల దిశగా భూమిని చేరసాగింది. అయితే, సరిగ్గా అదే సమయంలో సృష్టిలో సర్పజాతి అంతం కారాదనే ఉద్దేశంతో కొందరు జరత్కారువు అనే ముని వద్దకు వెళ్ళి, ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరతారు. జరత్కారువు తన కుమారుడు ఆస్తీకుని జనమేజయుని వద్దకు పంపగా, అతడు జనమేజయుని వద్దకు వచ్చి, తన విద్యా నైపుణ్యం చూపించి, సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి, ఆ యాగాన్ని ఆపు చేయించడంతో గండం గట్టెక్కిందని తక్షకుడు, ఇంద్రుడు ఊపిరి పీల్చుకుంటారు.

 ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే, చెడ్డవాడికి ఆశ్రయం ఇస్తే మంచివాడు కూడా కష్టాల పాలవుతాడని, అలాగే సర్పయాగం జరిగిందన్నా, ఆగిపోయిందన్నా అందుకు కారణం విధిసంకల్పమే. మన చేతులలో ఏమీ లే కున్నా, గర్వించడం, అహంకరించడం, దురభ్యాసాలకు లోనుకావడం వంటివాటి జోలికి పోకుండా, మన ప్రయత్నం మనం చేయాలి. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌
 

Read latest Specials News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top