అక్కడ తడిస్తే.. ఇక్కడ వణుకు..!!

Social Media Comments On Cyclone Phethai - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీలో ‘పెథాయ్‌’ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అసలైన శీతాకాలం రుచి తెలుస్తోంది. ఒక్కసారిగా ఊష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఓవైపు వర్షం. మరోవైపు చలితో ప్రజల దైనందిన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఇళ్లలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. చలిగాలుల తీవ్రతకు పెథాయ్‌ ప్రభావిత శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 26మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు ప్రాంతంలో మేతకు వెళ్లిన సుమారు వెయ్యి గొర్రెలు కూడా చలికి తట్టుకోలేక చనిపోయాయి. 

ఇక ఘటన ఎలాంటిదైనా తమ పాండిత్యాన్ని నలుగురితో పంచకోవడానికి వాట్సాప్‌ లాంటి సోషల్‌ ప్లాట్‌పామ్‌లలో కొందరు రెడీ అయిపోతారు. అటు ఏపీ, ఇటు తెలంగాణాల్లో దారుణమైన చలి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొందరి కామెంట్లు వైరల్‌ అయ్యాయి. ఆంధ్రా తెలంగాణ విడిపోలేదనీ వారు అంటున్నారు. ఏపీలోని జనం తడిస్తే.. తెలంగాణ ప్రజలు వణుకుతున్నారని తమ చాతుర్యాన్ని బయటపెడుతున్నారు. ‘దేవుడా, ఓ మంచి దేవుడా.. అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటే.. మరీ ఇంత చల్లగా చూడాలా స్వామి. మీకు ఇలా అర్థం అయిందా స్వామి. ఇక చాలు స్వామి చలితో విలవిల్లాడిపోతున్నాం. ఆంధ్రాలో తుపానుకి తెలంగాణలో వణుకుతున్నాం. ఎవరండి మేము విడిపోయామన్నది. వాళ్లు తడిస్తే మేము వణుకుతున్నాం. బంధం అంటే ఇదే కదా..!! అని చమత్కరిస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top