వైరలవుతోన్న 4వ తరగతి విద్యార్థి సమాధానం

Class 4 Student Refuses To Solve Problem That Compared Women Weight - Sakshi

వాషింగ్టన్‌: ఆడవారి టాపిక్‌ వస్తే చాలు.. మనలో చాలా మంది నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటారు. అలా మాట్లాడటం చాలా గొప్పగా ఫీలవుతుంటారు. అలాంటివారు ఈ చిన్నారిని చూసి బుద్థి తెచ్చుకోవాలి. వయసులో చిన్నదే కావచ్చు కానీ ఆలోచనలో మాత్రం చాలా మంది ‘పెద్ద’లకంటే ఎన్నో రెట్లు పెద్దది. అందుకే ఈ చిన్నారి చేసిన పని ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకు ఎవరా చిన్నారి.. ఏమా పని.. ఆ వివరాలు.. రిథమ్‌ పచేకో అనే పదేళ్ల చిన్నారి ముర్రేలోని గ్రాంట్‌ ఎలిమెంటరీ స్కూల్లో నాల్గవ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పచేకో మ్యాథ్య్‌ టీచర్‌ హోం వర్క్‌లో ఓ లెక్క ఇచ్చింది. ఓ పట్టికలో నలుగురు నాల్గవ తరగతి విద్యార్థినిల బరువులు ఇచ్చి వారిలో తక్కువ బరువున్న విద్యార్థిని కంటే ఇసాబెల్‌ ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమంది.

అయితే ఈ లెక్క పచేకోకు నచ్చలేదు. దాంతో వర్క్‌బుక్‌ మీద తాను ఈ లెక్కను చేయలేనని తెలపడమే కాక అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. పచేకో తన నోట్స్‌లో ‘ఏంటిది.. ఇది వారిని చాలా బాధపెడుతుంది. నేను ఇంత కఠినంగా ఉండాలనుకోవడం లేదు. ఈ లెక్కను నేను చేయడం లేదు. మీరిచ్చిన సమస్య చాలా బాగుంది. కానీ ఓ మనిషి మిగతా వారి కంటే ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమనడం నాకు నచ్చలేదు. అందుకే మీరిచ్చిన హోం వర్క్‌ను నేను చేయడం లేదు’ అని తెలిపింది. పచేకో మ్యాథ్స్‌ టీచర్‌ కూడా ఆ చిన్నారి చూపిన విజ్ఞతకు సంతోషించింది. వెంటనే దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దాంతో నెటిజన్లు కూడా పచేకో చేసిన పనిని అభినందిస్తున్నారు. అంతేకాక ఇలాంటి తలకు మాసిన సిలబస్‌ను తయారు చేసిన అధికారులను విమర్శిస్తున్నారు.

పచేకో తల్లిదండ్రులు దీనిపై స్పందిస్తూ.. ‘మా కూతురు చేసిన పనికి మేం ఎంతో గర్విస్తున్నాం. ఇంత చిన్న వయసులోనే తాను ఎంతో విజ్ఞతను చూపింది. ఏది మంచో దాని వైపే తాను నిలబడింది. చాలా సున్నితమైన అంశంపై నా కుమార్తె మరింత సున్నితంగా స్పందించింది. తన పట్ల మేం ఎంతో గర్వపడుతున్నాం’ అని తెలిపారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top