‘అఫ్గాన్‌ గర్ల్‌’ ను గుర్తు చేస్తున్న ఫొటో

Bangladeshi Worker Photo Captured In Malaysia Goes Viral - Sakshi

తమలో దాగున్న ప్రతిభను చాటుకునేందుకు నేటి యువత సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వివిధ రకాల యాప్‌లను ఉపయోగించి సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకునేందుకు శాయశక్తులు ఒడ్డుతోంది. అయితే ఇలాంటి ఆర్భాటాలేమీ లేకుండా కేవలం తన అమాయకపు ముఖంతో ప్రపంచమంతటినీ ఆకర్షిస్తున్నాడు ఓ యువకుడు. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఒకేఒక్క కనుగీటుతో పాపులర్‌ అయితే ఇతను మాత్రం తీక్షణమైన చూపులతో ఎనలేని క్రేజ్‌ సంపాదించుకుంటున్నాడు. తద్వారా సామాన్యుడికి కూడా సెలబ్రిటీ హోదా కట్టబెట్టే పవర్‌ కేవలం సోషల్‌ మీడియాకే ఉంటుందని మరోసారి నిరూపించాడు.

‘అతను చాలా సిగ్గుపడ్డాడు. అసలు ఎక్కడ చూపును కేంద్రీకరించాలో కూడా అతడికి తెలియదు. ఎందుకంటే అతడి ముఖాన్ని లెన్సులలో బంధించేందుకు నేను ఉపయోగించింది ఓ ఫోన్‌. ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాత..కెమెరా వైపు అతడు చూపులు సంధించిన తర్వాత చక్కని ఫొటో క్లిక్‌మనిపించాను. ఈ ఫొటో అందంగా లేదూ?’ అంటూ ఫొటోగ్రాఫర్‌ అబెడెన్‌మంగ్‌ ట్వీట్‌ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మలేషియాలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న బంగ్లాదేశ్‌ యువకుడిని సెలబ్రిటీని చేసింది. తీరైన ముక్కు, అమాయకపు కళ్లతో ఉన్న ఆ యువకుడి పేరు మాత్రం ఎవరికీ తెలియదు గానీ.. ఒక్కసారి చూస్తే గుర్తుండిపోయే రూపం తనదంటూ కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మరికొంతమంది... ‘ అఫ్గానీ గర్ల్‌ శర్బత్‌ గులా ఫొటోను గుర్తుకుతెస్తున్నాడు’ అంటూ ట్వీట్‌ చేస్తున్నారు. కాగా స్టీవ్‌ మెకర్రీ అనే జర్నలిస్టు... పాక్‌- అఫ్గనిస్తాన్‌ సరిహద్దుల్లో రెఫ్యూజీ క్యాంపులను సందర్శించినపుడు శర్బత్‌ ఫొటోను తీశారు. రెడ్‌​ స్కార్ఫ్‌ చుట్టుకుని, ఆకుపచ్చటి కనుగుడ్లతో తదేకంగా కెమెరాను చూస్తున్న శర్బత్‌ గులా ఫొటోను..1984 నేషనల్‌ జియోగ్రఫిక్‌ కవర్‌ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించిన సంగతి తెలిసిందే.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top