‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్‌..’

Anubhav Sinha Writes Open Letter On Trolls About Mulk Movie - Sakshi

నెటిజన్లపై ముల్క్‌ సినిమా దర్శకుడు అనుభవ్‌ సిన్హా ఆగ్రహం

పరువు, మర్యాదలే ఆస్తిగా భావించే ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంపై హఠాత్తుగా దేశ ద్రోహులు అనే ముద్ర పడింది. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలతో పాటు మీడియా అత్యుత్సాహం కూడా తోడవడం వారిని మరింతగా కుంగదీస్తోంది. ఇటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ లాయర్‌ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి’  ఇదీ సంక్షిప్తంగా ‘ముల్క్‌’  సినిమా కథ. కోర్టు రూంలో జరిగే డ్రామా ప్రధానంగా నడిచే ఈ సినిమాను దర్శకుడు అనుభవ్‌ సిన్హా తెరకెక్కించారు.

రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్‌ బబ్బర్, అశుతోష్‌ రాణా, రాజత్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన.. ‘ముల్క్‌’  సినిమా ఆగస్ట్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. ‘నేర చరిత గల ముస్లిం కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు, వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం కల్పించేందుకే అనుభవ్‌ ఈ సినిమా తీస్తున్నట్టు ఉంది. అసలు ఈ సినిమా వెనుక ఉన్నది ఎవరంటూ’​ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

తనపై ట్రోల్‌ చేస్తోన్న వారందరికి దిమ్మ తిరిగేలా ఓపెన్‌ లెటర్‌తో సమాధానమిచ్చారు ‘ముల్క్‌’ దర్శకుడు అనుభవ్‌  సిన్హా. ‘‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్‌..’ మిమ్మల్ని, మీ ఆలోచనా ధోరణిని చూస్తుంటే జాలి వేస్తోంది. మీ పనికిమాలిన ట్రోలింగ్‌ వల్ల ఎంతో మంది వ్యక్తుల కెరీర్లు, జీవితాలు ప్రభావితమవుతాయని మీకసలు తెలిసినట్టు లేదు. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి(సోషల్‌ మీడియా) రావడం. ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం. ఇది కాదు కావాల్సింది’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.

ఈ సినిమా నిర్మాతల గురించి తెలియజేస్తూ.... ‘‘ముల్క్‌’ సినిమాకు దావూద్‌ ఇబ్రహీం గానీ, కాంగ్రెస్‌ పార్టీగానీ, లేదా ఆరెస్సెస్‌ గానీ డబ్బులు సమకూర్చడం లేదు. కావాలంటే దావూద్‌, రాహుల్‌ గాంధీ, మోహన్‌ భగవత్‌లను మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి. ఈ సినిమా దర్శకుడిగా చెప్తున్నా.. దీపఖ్‌ ముకుత్‌, ఆయన తండ్రి కమల్‌ ముకుత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా తెలుకోండి’  అంటూ అనుభవ్‌ ఓ సుదీర్ఘ లేఖ రాశారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top