దుల్హన్‌ సాయం దూరం

Technical issue in dulhan scheam online portal - Sakshi

ఆదాయ పత్రాలే ప్రధాన ఆటంకం

ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్య

పేద ముస్లిం జంటలకు అందని ప్రభుత్వ ఫలాలు

పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దుల్హన్‌ పథకం అధికారుల నిర్లక్ష్యంతో విమర్శల పాలవుతోంది. అర్జీలు చేయడంలోనే ఆటంకాలు ఎదురవుతుండటంతో అర్హులకు ఈ పథకం ఫలాలు అందడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో, జిల్లాలో రెండు వందల మందికి పైగా పెళ్ళైన పేద ముస్లిం జంటలు ఈ పథకంలో లబ్ధిపొందకుండా, ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగదు అందితే కొంత వరకూ ఇబ్బందులు నుంచి ఉపశమనం పొందవచ్చన్న ఆశ ఆడియాశలుగానే మిగిలి పోతున్నాయి.

ఒంగోలు సెంట్రల్‌: నిరుపేద ముస్లిం యువతులు వివాహానంతరం రెండు నెలలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే వారు దుల్హన్‌ పథకం ద్వారా లబ్ధిపొందడానికి అర్హులవుతారు. లేకుంటే అనర్హులవుతారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్య తలెత్తుతున్నాయి. తరచూ ఈ సమస్య తలెత్తుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.అన్‌లైన్‌ పోర్టల్‌లో చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుంది. సమస్య రాష్ట్ర స్థాయిలో పరిష్కారించాల్సి ఉండటంతో జిల్లా అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు.

పథకం లక్ష్యం...
పేద ముస్లిం యువతులకు వివాహానికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది ముస్లింలు లబ్ధిపొందారు. అయితే వివాహం జరిగిన రెండు నెలల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. వధూవరుల ఆధార్‌కార్డులు, వివాహ ధ్రువీకరణ పత్రం, వధువు బ్యాంకు ఖాతా వంటి వాటిని ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ పథకానికి ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్య వచ్చి పడింది. దీంతో వందల మంది ఇబ్బందులు పడుతున్నారు.

ఆదాయ పత్రమే అసలు సమస్య...
సాధారణంగా దుల్హన్‌ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే అన్ని రకాల ఆదాయ పత్రాలతో పాటూ మీ సేవ ద్వారా లభించే ఆదాయ ధ్రువీకరణపత్రం కుడా అవసరం, రెవెన్యూ అధికారులు తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికి ఆదాయ పత్రం అవసరంలేదని, ఇవ్వడంలేదు. రేషన్‌కార్డునే ఆదాయ పత్రంగా వాడుకోవాలంటున్నారు. దీంతో దుల్హన్‌ పథకానికి దరఖాస్తులు చేసుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పని సరి. అది లేకుండా మిగిలిని వివరాలు ఆప్‌లోడ్‌ చేయలేరు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం 200 మంది వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని పథకం ద్వారా లబ్ధి పొందడానికి గత రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నివేదికలు ఇవ్వడంలో అలస్యం అవుతుండటంతో లబ్ధిదారులు ఎదురు చూపులు చూస్తున్నారు.

ఇప్పటి వరకూ దాదాపు 700 మంది వరకూ ఈ పథకం కింద లబ్ధి కల్పించినట్లు తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు.
- ఝాన్సీ రాణి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి 

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top