తొలి అంకానికి తెర

ZPTC And MPTC First Phase Nominations - Sakshi

సాక్షి, మెదక్‌: ప్రాదేశిక ఎన్నికల పోరులో తొలి విడతకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల (హవేళిఘణాపూర్, పాపన్నపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట) పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు 357, జెడ్పీటీసీ స్థానాలకు 32 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ మండలాల పరిధిలో మొత్తంగా 65 ఎంపీటీసీ స్థానాలుండగా.. 433  నామినేషన్లు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. ఈ నెల 25న (నేడు) నామినేషన్లను పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 26న విజ్ఞప్తుల స్వీకరణతోపాటు 27న స్క్రూటినీ నిర్వహించనున్నారు. 28న ఉపసంహరణ అనంతరం అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మే ఆరో తేదీన తొలి విడత పోలింగ్‌ జరగనుంది.
 
మండలాలు, పార్టీల వారీగా ఇలా.. 
హవేళిఘణాపూర్‌ మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 9, సీపీఎం, టీడీపీ నుంచి ఒకటి చొప్పున, కాంగ్రెస్‌ నుంచి 22, టీఆర్‌ఎస్‌ నుంచి 40, స్వతంత్రుల నుంచి 15 నామినేషన్ల చొప్పున మొత్తం 88 దాఖలయ్యాయి. అదేవిధంగా ఒక జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి ఒకటి చొప్పున, టీఆర్‌ఎస్‌ నుంచి రెండు.. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.

పాపన్నపేట మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి మూడు, కాంగ్రెస్‌ నుంచి 36, టీఆర్‌ఎస్‌ నుంచి 57, స్వతంత్రుల నుంచి 11..  మొత్తం 107 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి మూడు, టీఆర్‌ఎస్‌ నుంచి రెండు.. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

టేక్మాల్‌ మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి నాలుగు, కాంగ్రెస్‌ నుంచి 26, టీఆర్‌ఎస్‌ నుంచి 31, స్వతంత్రుల నుంచి తొమ్మిది..  మొత్తం70 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్‌ నుంచి రెండు, టీఆర్‌ఎస్‌ నుంచి నాలుగు.. మొత్తం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

అల్లాదుర్గం మండలంలో మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి రెండు, కాంగ్రెస్‌ నుంచి 20, టీఆర్‌ఎస్‌ నుంచి 26, టీజేఎస్‌ ఒకటి, స్వతంత్రుల నుంచి 13.. మొత్తం 62 నామినేషన్లు దాఖలయ్యాయి.

అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్‌ నుంచి 5, టీఆర్‌ఎస్‌ నుంచి 4, స్వతంత్ర ఒకటి.. మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. 
పెద్దశంకరంపేట మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు  కాంగ్రెస్‌ నుంచి 17, టీఆర్‌ఎస్‌ నుంచి 32, స్వతంత్రుల నుంచి 10.. మొత్తం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి రెండు, టీఆర్‌ఎస్‌ నుంచి మూడు.. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

రేగోడ్‌ మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్‌ నుంచి 18, టీఆర్‌ఎస్‌ నుంచి 27, స్వతంత్రుల నుంచి ఒక నామినేషన్‌.. మొత్తం 47 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి మూడు, టీఆర్‌ఎస్‌ నుంచి నాలుగు, స్వతంత్ర రెండు.. మొత్తం తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వివరించారు.

ఇక ప్రచార పర్వం
తొలి విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయిన నేపథ్యంలో గురువారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో పోరు రసవత్తరంగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఇప్పటికే తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సైతం ప్రచారానికి కసరత్తు చేస్తున్నారు.

టీడీపీ కనుమరుగు..
ఒకప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ.. ప్రస్తుతం కనుమరుగైందనే చెప్పాలి. మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆ పార్టీ నుంచి ఒక్కచోట మాత్రమే నామినేషన్‌ దాఖలైంది. హవేళి ఘణాపూర్‌లో టీడీపీ అభ్యర్థి ఒకరు నామినేషన్‌ దాఖలు చేశారు. జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఎవరూ ముందుకు రాలేదు. వామపక్షాల ప్రాబల్యం తగ్గిందనడానికి తొలి విడతలో దాఖలైన నామినేషన్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హవేళిఘణాపూర్‌ నుంచి ఒకరు సీపీఎం తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. సీపీఐ అభ్యర్థులు ఎవరు కూడా పోటీకి ముందుకు రాకపోవడం గమనార్హం. టీజేఎస్‌ సైతం ఈ ఎన్నికల బరిలో లేదు. అల్లాదుర్గం మండలంలో టీజేఎస్‌ తరఫున ఒకరు మాత్రమే దాఖలు చేయడం విశేషం. 

తొలి అంకానికి తెర 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top