టీడీపీ అబద్ధాల పుస్తకం 

YSRCP Slams On TDP Fake Campaign Over Chalo Atmakur - Sakshi

 ‘చలో ఆత్మకూరు’ పుస్తకంతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం 

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 8 మంది టీడీపీ నేతలు హతమయ్యారట! 

వారంతా వ్యక్తిగత కారణాలతో హత్యకు గురైన వారే, ఆత్మహత్య చేసుకున్నవారే  

మరణాలకు రాజకీయ రంగు పులుముతున్న తెలుగుదేశం పార్టీ  

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అన్ని అడ్డదార్లూ తొక్కుతోంది. పెయిడ్‌ ఆర్టిస్టులతో దుష్ప్రచారం సాగిస్తోంది. ఇది చాలదన్నట్టు ‘చలో ఆత్మకూరు’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో అన్ని అబద్ధాలు, అవాస్తవాలే ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 8 మంది టీడీపీ నేతలు హతమయ్యారని పుస్తకంలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో టీడీపీ నేత తాడిబోయిన ఉమాయాదవ్‌ హత్య, మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్‌కు చెందిన కొల్లి దుర్గాప్రసాద్, ప్రకాశం జిల్లా చినగంజాంలో పద్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోడానికి వైఎస్సార్‌సీపీ నేతలే కారణమని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. కానీ, వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి.

టీడీపీ కార్యకర్త కాకపోయినా...  
మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్‌కు చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌ జూలైలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి నివాసానికి సమీపంలో ఉండే వేరే కుటుంబంతో వివాదం చోటు చేసుకుంది. ప్రత్యర్థి వర్గం వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన దుర్గాప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి దుర్గాప్రసాద్‌ టీడీపీ కార్యకర్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాడు.

తోడికోడలితో గొడవ వల్ల ఆత్మహత్య  
ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో జూన్‌ 25న పద్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తోడికోడలు పాపమ్మతో ఆమెకు విభేదాలున్నాయి. జూన్‌ 25న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పద్మ ఆత్మహత్య చేసుకుంది. తాడిబోయిన ఉమాయాదవ్, కొల్లి దుర్గాప్రసాద్, పద్మ మరణాలతో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఇదే తరహాలో మిగిలిన ఐదు మంది హత్యల వెనుక వైఎస్సార్‌సీపీ ప్రమేయం ఏమాత్రం లేదు. వ్యక్తిగత గొడవలు, కుటుంబ కలహాల వల్ల జరిగిన హత్యలు, ఆత్మహత్యలకు టీడీపీ రాజకీయ రంగు పులుముతుండడం గమనార్హం.

పనితీరు నచ్చకే విధుల నుంచి తొలగింపు 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను ఉద్యోగాల నుంచి తొలగించారని టీడీపీ ‘చలో ఆత్మకూరు’ పుస్తకంలో ప్రచురించి ప్రచారం చేస్తోంది. నిజానికి వారి పనితీరు బాగోలేకపోవడం వల్ల సదరు కాంట్రాక్టు సంస్థ విధుల నుంచి తొలగించింది.

నిందితులంతా టీడీపీ వర్గీయులే   
మంగళగిరిలో జూన్‌ 25న టీడీపీ నేత, మాజీ రౌడీ షీటర్‌ తాడిబోయిన ఉమాయాదవ్‌ హత్యకు గురయ్యాడు. ఉమాయాదవ్, అదే పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు ఏనుగు కిశోర్‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమాయాదవ్‌ జూలై 8న వైఎస్సార్‌సీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నాడు. ఉమాయాదవ్‌ రాజకీయంగా బలపడతాడనే ఉద్దేశంతో అతడిని ఏనుగు కిశోర్‌ హత్య చేయించాడు. ఈ కేసులో పోలీసులు జూలై 10న 13 మందిని అరెస్టు చేశారు. వీరందరూ టీడీపీకి చెందినవారే కావడం గమనార్హం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top